సిద్దిపేట, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట నుంచి రైతులు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నదాతలు సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరాలు రాశారు. గత శాసనసభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని రైతులు మార్కెట్ యార్డుల్లో పోస్టుకార్డులు రాసి హెచ్చరికలు పంపారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డు, చిన్నకోడూరు మార్కెట్ యార్డు, రాఘవాపూర్,సిద్ధన్నపేట మార్కెట్ యార్డుల్లో సోమవారం రైతులు ఉత్తరాలు రాసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిండిపోతున్నా రైతులకు ఇవ్వాల్సిన బోనస్‌పై ప్రభుత్వం ఇంత వరకు ప్రకటన చేయలేదు. దీనిపై రైతులు సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టులు కార్డులు రాసి నిరసనను తెలిపారు. వరి ధాన్యానికి బోనస్ రూ. 500, రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు, రైతులకు రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ఆ పోస్టు కార్డుల్లో రైతులు ప్రశ్నించారు. రైతు బీమా, పంటల నష్టపరిహారం కింద రూ. 25 వేలు ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.