న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు పెద్ద ఎత్తున దెబ్బతినగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. గురువారం రాత్రి నుంచి వీచిన ఈదురుగాలులకు చేతికొచ్చే దశలో ఉన్న పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పొలాలు నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయాయి. చేతికొచ్చిన మక్క, మిర్చి పంట నీటిపాలైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లోని కల్లాల్లో ఆరబోసిన మక్క తడి సి ముద్దయింది. మిర్చిపై టార్పాలిన్ కప్పినా ఫలితం లేకుండా పోయింది. కొత్తగూడ, గంగారం, నర్సింహులపేట, వరంగల్ జిల్లా వర్ధన్నపేట, ములుగు జిల్లా గోవిందరావుపేట తదితర మండలాల్లో వరి, మక్క పంటలు నేలవాలాయి.
ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) నుంచి భద్రాచలానికి వెళ్లే రోడ్డులో రాళ్లవాగు వద్ద ఏర్పాటుచేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులను మణుగూరు, ఏటూరునాగారం మీదుగా మండల కేంద్రానికి తరలించారు. అకాల వర్షానికి తడిసిన మిర్చిని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట బహుజన వాది డాక్టర్ వివేక్ ఆధ్వర్యంలో మిర్చి రైతులు ధర్నా నిర్వహించారు.
మార్కెట్కు తెచ్చిన మిర్చి మొత్తం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కొండపల్లిలో బొప్పాయి, మిరప, వరి పంటలు దెబ్బతిన్నాయి. గాలి దుమారంతో 30 ఎకరాల్లో బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, పాల్వంచ, చండ్రుగొండ, చర్ల, దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో వరి, మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, తాంసి తదితర మండలాల్లో చేతికందిన జొన్న, మక్క, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది.
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ): వర్షాలతో దెబ్బతిన్న పంటలపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మార్కెట్లకు చేరుకున్న పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని సూచించారు.