మహబూబ్నగర్: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎరువుల కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో డీసీఎంఎస్ ఎరువుల కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టి పడి కాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెంచుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. అనేకచోట్ల కొంతమందికి మాత్రమే టోకెన్లు ఇస్తుండడంతో మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో రైతులకు పూర్తిస్థాయి ఎరువులు సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం యూరియా అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఇది సాక్ష్యంగా నిలుస్తున్నది. మరోవైపు యూరియాను బ్లాక్లో కొనేందుకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంది. యూరియాతో పాటు ఇతర వస్తువులను కూడా రైతులకు అంటగట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అవన్నీ బ్లాక్ మార్కెట్కు తరలిపోయి రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.