నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగా రైతులు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎర్రటి ఎండలో మండిపోతున్నారు. సహనం నశించిన రైతులు రోడ్లెక్కుతున్నారు. సోమవారం కూడా రాష్ట్రంలోని చాలాచోట్ల రోడ్లపై బైఠాయించి సర్కార్ తీరును ఎండగట్టారు. కాంటాలో జాప్యం, తరుగు పేరిట అదనపు తూకం వేయడాన్ని నిరసించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలలోని కోరుట్ల-వేములవాడ రోడ్డుపై చౌరస్తా వద్ద రైతులు ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో 18 రోజులుగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లికి చెందిన రైతు బండారి వీరేశం లారీ కోసం ఎదురు చూస్తూ వడ్ల బస్తాలపైనే నిద్రించాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఏఎంసీ ఎదుట, కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి నిరసన తెలిపారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. తూకం వేసి ఐదు రోజులైనా లారీలు రావడం లేదని ఆగ్రహించిన రైతులు మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో రైతులు రోడ్డెక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ ప్రధాన గేటుకు మక్క రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో మక్కల తరలింపులో జాప్యంపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం రైతులు వడ్లను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామెరచర్లలో రైతులు రోడ్డుపై ధాన్యం కుప్పగా పోసి నిప్పంటించి నిరసన తెలిపారు.
రైతుకు తేలు కాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాలలోని కొనుగోలు కేంద్రంలో సోమవారం రాత్రి రైతు కొమిరిశెట్టి శ్రీనివాస్‌కు తేలు కాటేసింది. చికిత్స నిమిత్తం అతడిని ఎల్లారెడ్డిపేటలో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో 25 రోజులుగా నిత్యం పడిగాపులు కాస్తున్నాడు. ఇటీవల కుప్పను అడవి పందులు ధ్వంసం చేయడంతో రైతు శ్రీనివాస్ టార్పాలిన్ కవర్లను సరిచేస్తున్న క్రమంలో అతడి కుడి కాలు చిటికన వేలుకు తేలు కాటేసింది.

సూర్యాపేట జిల్లా శాంతినగర్‌లోని ఎఫ్‌సీఐ గోదాము వద్ద భారీగా బారులుదీరిన ధాన్యం లారీలు

హనుమకొండ జిల్లా శాయంపేటలో లారీలను పంపాలని సొసైటీ సీఈవోకు చేతులెత్తి మొక్కుతున్న రైతు

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో రాస్తారోకో చేస్తున్న రైతులను సముదాయిస్తున్న పోలీసులు

తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో రైతులు నిర్వహించిన ధర్నా వద్ద తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎస్సై అనిల్, ఆర్ఐ అశోక్ కాళ్లపై పడుతున్న రైతులు

కొనుగోలులో తాత్సారాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మార్కెట్ కార్యదర్శి, సెంటర్ ఇన్చార్జ్జిని నిలదీస్తున్న మక్క రైతులు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లిలో కాంటా పూర్తయినా లారీలు రాకపోవడంతో బస్తాలపైనే
నిద్రిస్తున్న రైతు బండారి వీరేశం