కందుకూరు, జూన్ 17 : ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదని కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని ఊట్లపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గ్రామంలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తేరేటి లక్ష్మణ్ ముదిరాజ్ మాట్లాడుతూ రైతులకు నోటిఫికేషన్ జారీ చేశారని మండిపడ్డారు. ఒక రోజు ముందు నోటిఫికేషన్ జారీ చేసి, మరుసటి రోజు భూముల ధరల రేట్లు పెంచారని తెలిపారు.
రైతులంటే అంత చులకనెందుకని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులను ఇబ్బందులు పెడుతరా అంటూ నిలదీశారు. 283.22 ఎకరాల పట్టా భూములు తమ అంగీకారం లేకుండా ఎలా తీసుకుంటారని రైతులు ప్రశ్నించారు. భూముల కోసం తమపై ఒత్తిడి తెస్తున్నారని, మార్కెట్ ధరకంటే రెండింతలు ఇస్తే సీఎం రేవంత్ ఇల్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని, జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు.
గతంలో సేకరించిన భూములపై విచారణ చేపట్టాలని మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. అధికారులు ఇష్టానుసారంగా నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. భూములు కోల్పోయిన ప్రతిరైతుకూ నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లేశ్, ఉప సర్పంచ్ తేరేటి రవి ముదిరాజ్, రైతులు ప్రభాకర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.