వీణవంక/సైదాపూర్/మల్లాపూర్/పెనుబల్లి (కల్లూరు), ఆగస్టు 9 : పండుగపూటా యూరి యా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రైతులు రాఖీ పండగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి సొసైటీల వద్ద క్యూలో నిలబడగా, పోలీసుల పహారాలో ఒక్కొక్కరికి రెండు బస్తాలు మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీణవంక మండ లం నర్సింగాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు 230 బస్తాలతో లారీ లోడ్ వచ్చింది.
ఒక్కొక్కరికి ఆధార్కార్డుపై 2 బస్తాలు మాత్రమే ఇవ్వగా, 215 మంది రైతులకు యూరియా అందలేదు. సైదాపూర్లోని వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘానికి 230 బస్తాలు రాగా రైతులు సొసైటీ వద్దకు వచ్చి చెప్పులను క్యూలో పెట్టారు. పోలీసుల పహారా లో రైతులకు రెండు బస్తాలు మాత్రమే అందించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ సహకార సంఘానికి 340 బస్తాల లోడ్ రాగా రైతులతో కార్యాలయం ఆవరణ కిక్కిరిసిపోయింది. పట్టాదారు పాస్బుక్ ఆధారంగా ఒక్కొక్కరికి నాలుగు బస్తాలు మాత్రమే అందజేశారు. పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నారులో రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతుసంఘం జిల్లా నాయకుడు మాదల వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం ఇబ్బందిపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.