Kaleshwaram | సూర్యాపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు రైతులు ఏడేండ్ల తరువాత కరువును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడంతో సూర్యాపేట జిల్లాలోని శ్రీరాంసాగర్ ఆయకట్టుకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఇంచు భూమి వదలకుండా రైతులు వరి పండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి నీళ్ల కోసం అరిగోస పడుతున్నారు. ఈ యాసంగి వరి నాట్లు వేసిన 20 రోజుల నుంచే ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు రావడం లేదని, నాటేసిన వరి ఆదిలోనే ఎండిపోతుందని రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
ఎస్సారెస్పీ కింద సూర్యాపేట జిల్లాలో 2.95 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉండగా, నీళ్లు రావనే అనుమానంతో 2.50 లక్షల్లో నాట్లు పడ్డాయి. చాలాచోట్ల వానకాలంలో కురిసిన వర్షాలతో బావులు, బోర్లలో నీళ్లు ఉండటం తో నాట్లు వేసినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు అందకపోవచ్చని ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం నీటి నిల్వలు తక్కువ ఉన్నందున పూర్తిస్థాయిలో ఇవ్వడం కుదరని అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ యాసంగిలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద 50 శాతం వరి ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.