కోనరావుపేట, ఏప్రిల్ 26 : కొనుగోలు కేం ద్రంలో పోసిన ధాన్యాన్ని కొనకపోవడం.. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తుండటంతో రైతన్న కడుపు మండింది. చేసేదేమీ లేక రోడ్డుపై బైఠాయించి ధాన్యాన్ని తగులబెట్టి నిరసనకు దిగిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం అజ్మీరా తండాలో శనివారం చోటుచేసుకున్నది.
అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరును నిరసిస్తూ అజ్మీరా తండా వద్ద సిరిసిల్ల- మరిమడ్ల ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు బైఠాయించి రెండు గంటలపాటు ధర్నా చేశారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి నిప్పు పెట్టారు. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. లారీలు వస్తాయని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన అధికారులతో రైతులకు ఫోన్లో మాట్లాడించడంతో ఆందోళన విరమించారు.
ఆందోళన సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. అవగాహన లేని సీఎంతో తమకు కష్టాలు మొదలయయ్యాని ఆవేదన వ్యక్తంచేశారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఇటు తూకం వేయకుండా, అటు తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.