నెన్నెల, సెప్టెంబర్ 18: ‘అయ్యా గవర్నర్ గారూ.. మాకు రుణమాఫీ కాలేదు.. మమ్మల్ని పట్టించుకుని రుణమాఫీ అయ్యేలా చూడండి’ అంటూ 300 మందికిపైగా రైతులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉత్తరాలు రాశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం, గొల్లపల్లి, ఘన్పూర్, నందులపల్లి, నెన్నెల, జంగాల్పేటకు చెందన రుణమాఫీ కాని రైతులందరూ బుధవారం మండలంలోని పోస్టాఫీస్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌కు రిజిస్టర్ పోస్టు చేశారు. ఈ ఉత్తరాల్లో రైతు వివరాలతోపాటు తీసుకున్న రుణం, బ్యాంకు ఖాతా నంబర్ రాశారు.
‘కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు పంట రుణం రూ.2 లక్షలు మాఫీ చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక బడ్జెట్ ప్రసంగంలో కూడా రుణమాఫీ చేస్తున్నట్టు తమ ద్వారా(గవర్నర్) మాట్లాడించారు. ఇటీవల మూడు విడతలుగా రుణమాఫీ చేశారు. కానీ.. మాకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రెండు చేతులతో ప్రార్థిస్తున్నాం..’ మీ రైతు సోదరుడు అంటూ గవర్నర్‌కు ఉత్తరాలు రాసి నెన్నెల పోస్టాఫీసులో రిజిస్టర్ పోస్టు చేశారు.
ఓట్లప్పుడేమో పంట లోను ఉన్నోళ్లకు రెండు లచ్చలు మాఫీ జేస్తానని ఓట్లకచ్చిండ్లు. ఓట్లయినంక కొందరికే చేసిండ్రు. నేను నెన్నెల బేంకులో రూ. లచ్చఅరవై వేల పంట లోను తీసుకున్న. మాఫీ జేస్తరని నమ్మి ఓటు వేసిన. కానీ.. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలే. ఎవుసం పని ఇడిసి పెట్టి లోను మాఫీ కాలేదని బేంకుల సుట్టూ తిరిగినా ఎవరు సప్పుడు చేయట్లే. నా భార్యకు కూడా పంట లోను ఉంది. ఆమేకు కూడా రాలేదు. ఇక్కడకు వచ్చి పెద్దాయనకు ఉత్తరం రాసిన. న్యాయం జేస్తడని అనుకుంటున్న. – సోంసెట్టి మల్లయ్య, రైతు, నందులపల్లి