హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/మాడ్గుల : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలోని చారిత్రక రంగసముద్రం చెరువుకు మోక్షం లభించింది. రియల్టర్ల చెర వీడటంతో జలకళ సంతరించుకుంటున్నది. 400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు భూగర్భజలాల పెంపునకు నెలవైన ఈ చెరువు రియల్ వలలో చిక్కుకుని బీడువారిపోయింది. ఈ ఏడాది జనవరిలో గ్రామ రైతులు ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించి చెరువును రక్షించాలని కోరాగా.. ‘రియల్ వలలో రంగ సముద్రం విలవిల’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు మే నెలలో కత్వ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
రూ.5 లక్షలతో మరమ్మతులు చేయడంతోపాటు చెరువు వరకు కాల్వను పునరుద్ధరించారు. చెరువుకట్ట పటిష్టానికి రూ.16 లక్షలతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దవాగు ద్వారా చెరువులోకి నీరు చేరుతుంది. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏండ్ల తర్వాత చెరువులో జలకళ చూస్తున్నామని ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.