Jangaon | దేవరుప్పుల, జూన్ 22 : విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యాన్ని రైతులు విలువైన పంటలను కోల్పోతున్నారు. పదిహేను రోజులుగా కరెంట్ లేక దుక్కులు, నారు మళ్లు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మండల కేంద్రంలోని గడ్డ చెలుకకు పోయే దారిలో ఎస్ఎస్-39 నంబర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులవుతున్నది.
ఆ ట్రాన్స్ఫార్మర్పై ఉన్న 5 వ్యవసాయ మోటర్లు నడవకపోడంతో పోసిన నార్లు, దున్నిన దుక్కులు ఎండుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరెంటోళ్లు పట్టించుకోకపోవడంతో 8 రోజుల క్రితమే తామే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ను సింగరాజుపల్లి రిపేరింగ్ సెంటర్‌కు తరలించినట్టు తెలిపారు. పలుమార్లు కరెంటు అధికారులను సంప్రదించగా ఇదిగో వస్తది.. అదిగో వస్తది అంటూ ఒకటే సమాధానం చెప్పి పంపుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిన వెంటనే మరొకటి బిగించి, కరెంటు సరఫరా చేసే వారని, ఇప్పుడు ట్రాన్స్పార్మర్ కాలితే నరకం చూపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరొకటి రావడానికి 15 రోజులకుపైగా సమయం పడుతున్నదని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా బాధిత రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ సుధాకర్‌ను వివరణ కోరగా రెండు రోజుల్లో కొత్త ట్రాన్స్ ఫార్మర్ బిగిస్తామని తెలిపారు.
నీళ్లు లేక తిప్పలైతాంది..
15 రోజులుగా కరెంట్ లేక నారుమ డి ఎండింది. దున్నిన దుక్కి ఎండింది. నీరు లేక వానకాలం నాటు ఆలస్యమైతాం ది. చాలాసార్లు కరెంటు ఆఫీసుకు పోయి ట్రాన్స్ఫార్మర్ విషయాన్ని అడిగితే రెండు రోజుల్లో వస్తుందని చెప్పి పంపిర్రు. శనివారం మళ్లీపోతే ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ నంబర్ ఇచ్చిండ్రు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే ఇప్పట్ల రాదని చెబుతున్నరు. రెండునెలల కింద ఒకసారి కాలింది. వారం రోజులకు ఇచ్చిండ్రు. ఇప్పడు మళ్లీ ట్రాన్స్ఫార్మర్ కాలి 15 రోజులైంది.
– సుంకరబోయిన యాదయ్య, రైతు
పసులకు నీళ్లు బకిట్లళ్ల మోసుకొస్తున్నం..
వానకాలం నెత్తిమీదికి వచ్చింది. నార్లు పోసినం. నీళ్లు లేక నాట్లు లేటయితున్నయ్. రెండు ఆవులకు తాగడానికి నీళ్లు లేక దూరం నుంచి బకిట్లళ్ల తెచ్చి తాపుతున్నం. ట్రాన్స్ఫార్మర్ కోసం కరెంటు ఆఫీస్ సుట్టూ తిరిగితిరిగీ యాస్టకొస్తున్నది. దబ్బున కొత్తది తెచ్చి బిగిస్తే దుక్కులు దున్నుకుంటం. ఎన్నడూ లేంది కరెంటోళ్లు ఇంత ఆలస్యం చేస్తుండ్రు.
– వల్లాల ఎల్లయ్య, రైతు
వ్యవసాయ బావుల్లో అడుగంటిన నీరు

వానకాలం ప్రవేశించి పక్షం రోజులు దాటినా ఆశించిన వానలు పడలేదు. వ్యవసాయ బావిలో జలాలు అడుగంటిపోవడంతో వేసిన నారుమళ్లను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కోవలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన దీటి చంద్రయ్య గంటకు సుమారు రూ.4వేలు వెచ్చించి ఎక్స్‌కవేటర్‌తో తన వ్యవసాయ బావిలో పూడిక తీయిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు రైతు మాట్లాడుతూ.. ఈ యేడు వానలపై ఆశలు వదులుకొని వరి సాగు కోసం బావిలో పూడిక తీయిస్తున్నట్టు చెప్పారు. గ్రామంలో తనతోపాటు చాలామంది రైతులు తనలాగే బావుల్లో పూడిక తీయిస్తున్నారని చంద్రయ్య తెలిపాడు.
– ధర్మారం
పత్తి సాగుకు విపత్తు

భూపాలపల్లి జిల్లాలో 95 వేల ఎకరాల్లో ఈ వానకాలం పత్తి పంట సాగవుతుందని అంచనా వేయ గా ఇప్పటివరకు రైతులు 30 వేల ఎకరాల్లో నాటి న విత్తనాలు ప్రస్తుతం మొలకెత్తాయి. అవి వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితిలో ఉండగా రైతులు తోచిన విధంగా నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. కాటారం మండలం చింతకాని వద్ద పత్తి మొక్కలకు ట్రాక్టర్ డ్రిప్ ద్వారా రైతు లక్ష్మారెడ్డి ఇలా నీటిని పడుతున్నాడు.
– జయశంకర్ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ
బైక్ నాగలితో దున్నేద్దాం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో వెల్డింగ్ పనిచేసే గడీల నరేశ్, బైక్ మెకానిక్‌గా పనిచేసే అతడి సోదరుడు గడీల నాగరాజు కలిసి పాత ద్విచక్రవాహనానికి పత్తి పంటలో కలుపు తీసే నాగలిని అమర్చారు. ద్విచక్రవాహనానికి సరిపోయేలా నాగలిని తయారు చేసి బిగించారు. ఇది గంటకు లీటరు పెట్రోలు ఖర్చుతో ఎకరంలో కలుపు తీస్తుందని, దీనిని రూ.8 వేల ఖర్చుతో తయారు చేశామని తెలిపారు. మండలంలోని ఊట్ల గ్రామానికి చెందిన లచ్చిరాంనాయక్ కోసం ఈ నాగలిని తయారు చేశారు.
-గూడూరు