యాచారం, ఏప్రిల్ 17: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్ద పెద్ద చెరువు ఫెన్సింగ్ పనులను ఆ గ్రామ రైతులు, మత్స్యకారులు అడ్డుకున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తే తాము ఎట్ల బతకాలని అధికారులను నిలదీశారు. ఫెన్సింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని, చెరువును సంరక్షించాలని వారు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పెద్ద చెరువుకు ఫెన్సింగ్ వేసేందుకు హిటాచీలు, జేసీబీలతో చెట్ల పొదలు, కంప చెట్లు, రాళ్లు, రప్పలు తొలగించే పనులను పోలీసు బందోబస్తు నడుమ అధికారులు చేపట్టారు.
విషయం తెలుసుకున్న కుర్మిద్ద రైతులు, మత్స్యకారులు సంఘటనాస్థలానికి చేరుకొని పనులను అడ్డగించారు. దీంతో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు, ఎస్ఐ తేజంరెడ్డి అక్కడికి చేరుకొని ఫెన్సింగ్ వేయడం లేదని, సర్వే కోసం భూమిని చదును చేస్తున్నామని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఫార్మా భూముల సర్వే పేరుతో చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు, మత్య్సకారులు మండిపడ్డారు.
పశువులు, మూగజీవాలు నీళ్లు తాగేందుకు వీలు లేక అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు చుట్టూ కంచె వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులను కాపాడాల్సిన అధికారులే కంచె వేయడం సరైంది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారుల హెచ్చరికలకు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. వెంటనే భూమి చదును చేసే పనులు నిలిపివేయాలని ఆందోళనకు దిగడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల తాటిపర్తి గ్రామంలోని బంధం చెరువుకు కంచె వేయాలని చూడగా.. రైతులు అడ్డుకున్న విషయం విదితమే.
ఫార్మాసిటీ భూముల్లో ఉన్న చెరువులు, కుంటలను ప్రభుత్వం కాపాడాలి. చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేస్తే ఊరుకునేది లేదు. ప్రజలకు చెరువులు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి. మత్స్యకారులు వెళ్లేందుకు వీలుగా దారి వదిలి ఫెన్సింగ్ వేసుకోవాలి. పశువుల కాపరులు చెరువు వద్దకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి. మూసీ ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వం ముందు గ్రామీణ ప్రాంతాల చెరువులు, కుంటలను సంరక్షించాలి. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయొద్దు. అధికారులు, పోలీసులు రైతుల పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు.
– కవుల సరస్వతి, పర్యావరణవేత్త