రుణమాఫీపై రైతుల నిరసనలు హోరెత్తుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చారు. రుణమాఫీ ఎందుకు కాలేదని అధికారులను నిలదీశారు. బ్యాంకుల ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మండల కార్యాలయాలకు బాటపట్టి, అధికారులకు ఫిర్యాదులు చేశారు. అర్హత ఉన్నా తమకు ఎందుకు మాఫీ కాలేదంటూ గోడు వెళ్లబోసుకున్నారు. జగిత్యాల జిల్లా రాఘవపేటలో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు సమావేశమై ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా రాఘవపేటలో రిలే దీక్షలు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో రిలే నిరాహారదీక్ష చేస్తున్న రైతులు. 400 మందికి రుణమాఫీ కాలేదని రైతులు తెలిపారు. నెలరోజుల్లోగా రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఏడీఏ రైతులకు హామీ ఇచ్చారు.
పండుగ పూట.. మండల కేంద్రానికి పోరుబాట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో తమకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు. పండుగ ఉన్నా 200మందికి పైగా రైతులు ఏవోకు ఫిర్యాదులు చేశారు.
కేసీఆరే నయం.. కాంగ్రెస్ సాయమే అందకపాయే!
నాకు ఆరెకరాలు భూమి ఉన్నది. రూ.2.50 లక్షల లోన్ ఉన్నది. మూడు విడుతల్లోనూ నాకు రుణమాఫీ కాలే. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పని చేసిన. కేసీఆర్ ప్రభుత్వమే నయం. అప్పుడు ఒక్కసారే రూ.80 వేలు మాఫీ వస్తే మళ్లా రుణం తీసుకున్న. అప్పుడు ఇట్లా బ్యాంకులు, వ్యవసాయ అధికారుల సుట్టూ తిరుగుడు లేకుండె.
-సాకి యాకయ్య, కొరిపల్లి గ్రామం, పెద్దవంగర(మహబూబాబాద్)
ఒకరికొచ్చింది.. ఇంకొకరికి రాలే!
నాకు అశ్విని, అఖిల ఇద్దరు కూతుళ్లు. చెరి రెండెకరాల చొప్పున వ్యవసాయ భూమి, పట్టా పాస్‌బుక్‌లు ఉన్నాయి. అశ్విని పేరును రూ.60 వేలు, అఖిల పేరును రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. అశ్విని రూ.60 వేలనే మాఫీ చేశారు. అఖిల పేరుపై ఉన్న రూ.1.20 లక్షలు మాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే రాదని అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు.
– మోదిపట్ల రాములు, తానేదార్పల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లా
నాకు రూ.1.80 లక్షలున్నా మాఫీగాలే!
నాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నాలుగేండ్ల క్రితం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.80 లక్షలు లోన్ తీసుకున్నా. నాకు మూడు విడుతల్లోనూ రుణమాఫీ కాలేదు. రుణమాఫీపై సర్కారు మోసపూరిత ప్రకటనలు చేస్తూ రైతులకు ఆన్యాయం చేస్తున్నది. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ సర్కారుకు రైతులు తగిన గుణంపాఠం చెప్పాలి. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి.
-కొలుగూరి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, కట్కూరు (సిద్దిపేట జిల్లా)
సగం మంది రైతులకు మాఫీ కాలేదు
సీఎం రేవంత్‌రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మూడు విడుతలు పెట్టిండ్రు. ఊళ్లల్లో మాత్రం సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదు. 3 లక్షలలోన్ తీసుకున్నా. రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు.
-జిల్లెల గాల్‌రెడ్డి, రైతు, కట్కూరు (సిద్దిపేట జిల్లా)
నేను కాంగ్రెస్ కార్యకర్తనే.. అయినా రుణమాఫీ కాలే
నాకు ఐదున్నరెకరాల భూమి ఉన్నది. 2.20 లక్షల లోన్ ఉన్నది. నెల కింద 14 వేలు మిత్తి కట్టి రెన్యువల్ కూడా చేసిన. మూడో విడతలో రుణమాఫీ లిస్టులో నా పేరు రాలే. నేను కాంగ్రెస్ కార్యకర్తనే. కాంగ్రెస్ ప్రభుత్వంల రుణమాఫీ పరిస్థితి గిట్లుండే. మా ఊర్లో చాలామందికి రుణమాఫీ కాలే.
– కలుకోటి వెంకట్‌రెడ్డి, కొరిపల్లి, పెద్దవంగర (మహబూబాబాద్)