కురవి, డిసెంబర్ 15 : రుణమాఫీ చేయాలని కోరుతూ ఓ రైతు నిరాహార దీక్షకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన బేతమళ్ల సహదేవ్‌కు రెండు ఎకరాల పట్టా భూమి ఉన్నది. వ్యవసాయం చేస్తూనే పార్ట్‌టైంగా మీడియాలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కురవి సొసైటీ పరిధిలోని ఆంధ్రాబ్యాంకులో రూ.60 వేల రుణం తీసుకున్నాడు. మిత్తితో మొత్తం రూ.83,995 ఉన్నది.
తనకు అన్ని విధాలా అర్హతలు ఉన్నా రుణం మాఫీ కాలేదని రైతు సహదేవ్ ఆవేదన వ్యక్తంచేశారు. రూ.2 లక్షలలోపు రుణం ఉండి మాఫీ కాకుండా ఉన్న రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నిరసన దీక్ష చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దీక్షకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, దొడ్డి గోవర్ధన్‌రెడ్డి, గుగులోత్ రవి, రాజునాయక్, సాంబశివరావు, వెంకన్న, రమేశ్, సైదులు, వీరభద్రం, జర్నలిస్టు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.