మేడ్చల్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని రైతులు యోచిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4,600 మంది రై తులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. జిల్లాలో 26 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొందరికి కాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రుణమాఫీ కోసం ఉద్యమించాలని బాధిత రైతులు నిర్ణయించినట్టు తెలిసింది. ఘట్కేసర్ మండల రైతులు రుణమాఫీ సాధన సమితి పేరిట కలెక్టరేట్ ఎదుట ఇటీవల ధర్నా నిర్వహించిన విష యం తెలిసిందే. దీంతో జిల్లాలోని రుణమాఫీ కాని రైతులందరూ ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు. మాఫీ పొందని రైతులు సహకార సంఘాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అప్పట్లో ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో వేలాదిమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు మాఫీ కాలేదు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాల్సిందేనని, లేదంటే పోరాటాలు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
రుణమాఫీ చేయకుంటే పోరాటమే
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి. లేదంటే పోరాటం చేయాలని రైతులు యోచిస్తున్నారు. నిబంధనల పేరుతో కావాలనే కొందరికి రుణమాఫీ చేయలేదు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసి రైతులకు న్యాయం చేయాలి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రైతులకు రూ. 1.62 కోట్ల బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. మూడు నెలల క్రితమే ధాన్యం విక్రయించినప్పటికీ ఇప్పటికీ బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు.
– మధుకర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్