హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అన్నదాతలను భూమితో విడదీయడం ఎవరితరమూ కాదని నాదర్గుల్ రైతులు రుజువు చేశారు. డబ్బు, అధికార బలంతో నిలువరించడమనేది తాత్కాలికమేనని చాటి చెప్పారు. దశాబ్దాలుగా తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇనుప రేకులతో బంధించి భూమి పుత్రులను ఆ దరిదాపులకు రానీయకుండా చేసిన కుట్రలను ఛేదించారు. ఇన్నాళ్లూ అధికారుల చుట్టూ తిరిగినా ఎక్కడా కాసింత అండ దొరక్క నైరాశ్యంలో ఉన్న రైతులకు రెండు రోజుల క్రితం మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మనోధైర్యాన్ని కల్పించడంతో ఆశలు చిగురించాయి. దీంతో సోమవారం ఉదయం నాదర్గుల్ రైతులు ‘మా భూములు మాకేనని’ అంటూ రెండేండ్లుగా దూరమైన తమ వ్యవసాయ భూముల్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు భూముల వద్దే ఉన్నారు. దాదాపు 40-50 మంది రైతులు భూముల్లోకి వెళ్లడంతో ఇతర రైతుల్లోనూ ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా తమ భూములు దక్కుతాయో! లేదోనన్న సందేహంలో ఉన్నామని, ఇప్పుడు భూముల కోసం ఎంతవరకైనా పోరాడుతామని రైతులు తెగేసి చెప్తున్నారు. ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు తమకు దక్కేలా చేయాలంటూ రైతులు సాయంత్రం ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించారు.

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధి సర్వేనంబర్ 613లోని భూమిలో మునుపటికి భిన్నంగా కొత్త దృశ్యాలు కనిపించాయి. ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమి దాదాపు రెండున్నరేండ్లుగా దూరమై రైతులు దిక్కుతోచక చకోర పక్షుల్లా తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రికార్డుల్లో అవి సర్కార్ భూములేనని నమోదు చేసిన అధికారులు తెరవెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలుకుతూ రైతులను గాలికొదిలేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు హైడ్రా సైతం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు బౌన్సర్లను పెట్టి మరీ రైతులను బెదిరించి తరిమేశాయి. మరోవైపు ఆదిబట్ల పోలీసులు కూడా కేసులు బనాయిస్తుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ఈ క్రమంలో ప్రభుత్వ భూముల్ని రక్షించాల్సిన సర్కార్ పెద్దలే భక్షకులుగా మారిన వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడం సంచలనంగా మారింది. అనంతరం ఆదివారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు నాదర్గుల్ భూముల బాగోతాన్ని బట్టబయలు చేశారు. ఈ భూముల వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి ఉన్న బంధాన్ని బయటపెట్టారు.
ప్రధానంగా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని.. ఏండ్ల తరబడిగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహా అక్కడికి వెళ్లి రైతులకు అండగా నిలుస్తామని హెచ్చరించారు. దీంతో ఇన్నాళ్లూ తమనెవరూ పట్టించుకోవడంలేదంటూ నైరాశ్యంలో ఉన్న నాదర్గుల్ రైతులకు కొండంత అండ దొరికినట్టయింది. తమ భూములు తమకు దక్కుతాయన్న విశ్వాసం వాళ్లలో కలిగింది.
ఇన్నాళ్లూ అటువైపు వెళ్లేందుకే జంకిన నాదర్గుల్ రైతులు సోమవారం ఉదయం ధైర్యంగా తమ భూముల్లోకి వెళ్లారు. ప్రైవేట్ కంపెనీలు చుట్టూ వేసిన రేకుల ప్రహరీ కంచె దాటుకొని దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల వద్దకు వెళ్లారు. గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తుండగా సోమవారం మాత్రం 40-50 మంది రైతుల కుటుంబాలు అందులోకి పోయాయి. తమ భూముల నుంచి కదిలేదని తేల్చిచెప్పారు. ఎండను లెక్క చేయకుండా సాయంత్రం వరకు తమ భూముల్లో చెట్ల కిందే రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇదే సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు అక్కడికి వచ్చారు.
భూముల్లో లచ్చమ్మకుంట ఉన్నందున దాన్ని పరిశీలించారు. ఆ అధికారులకు సహాయంగా రైతులు కూడా ఆ నీటి వనరుల చుట్టూ తిరిగి వివరాలు ఇచ్చారు. మరోవైపు హైడ్రా అధికారులు కూడా సోమవారం రెవెన్యూ, మున్సిపల్ శాఖల నుంచి 613 సర్వేనంబర్ భూములకు సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లు సేకరించారు. మరోవైపు సాయంత్రం తర్వాత రైతులు కొందరు ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు.
భూములకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్లు ఇవ్వాలని, వాటిని పరిశీలించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు రైతులకు చెప్పారు. కానీ భూముల దగ్గర ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వొద్దని సూచించారు. ఇందుకు అంగీకరించిన రైతులు తమ దగ్గర తాతల నుంచి చెల్లించిన భూమి శిస్తు రసీదులు, ఇతర డాక్యుమెంట్లు ఇస్తామని, తమను భూముల్లోకి పోకుండా అడ్డుకుంటున్న వ్యక్తులను అందులోకి రాకుండా చూసి తమకు న్యాయం చేయాలని లిఖితపూర్వకంగా పోలీసులకు వినతిపత్రం ఇచ్చారు.