బయ్యారం, ఏప్రిల్ 4: అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద ఎత్తున యాసంగిలో మొక్కజొన్న సాగు చేయగా వంట చేతికి రావడంతో విక్రయించేందుకు కళ్లాల్లో ఆరబెట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. మిర్చి పంట చివరి దశకు చేరుకోగా విక్రయించేందుకు కల్లాల వద్ద అరబెట్టగా వర్షం కారణంగా తడిసి ముద్దయింది.
వర్ష సూచన ఉండడంతో పంటలను టార్పాల్ కప్పి కాపాడేందుకు రైతులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన పంటకు నష్టం వాటిల్ల దింతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో గురువారం రాత్రి ఓ ఇంట్లోని కొబ్బరి చెట్టుపైపిడుగు పడటంతో స్థానికులు భయాందోళన చెందారు.
మరో రెండు రోజులు వానలు
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్ , ఎల్లో హెచ్చరికలను జారీచేసింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అకడకడా వడగండ్లు కురిసే అవకాశం ఉన్నదని పేరొన్నది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాది భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మలాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మలాజ్గిరి, వికారాబాద్, జనగాం తదితర జిల్లాల్లో అకడకడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.