PACS | గండీడ్, ఆగస్టు 5: రైతులకు తెలియకుండా, ఫోర్జరీ సంతకాలతో వారి పేరిట సహకార సంఘం సిబ్బందే రుణాలు తీసుకున్న వైనం మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూసింది. రైతు రుణమాఫీ నేపథ్యంలో జిల్లాలోని గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ బాగోతం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డిపల్లి, కొంరెడ్డిపల్లి, సాలార్నగర్, పెద్దవార్వల్ తదితర గ్రామాల రైతులు సోమవారం పీఏసీసీఎస్కు తరలివచ్చారు. తాము రుణాలు తీసుకోకున్నా మాఫీ అయినట్టు మెసేజ్లు రావడమేమిటని సిబ్బందిని నిలదీశారు.
దీనికి సహకార సంఘం సిబ్బంది నిర్లక్ష్యంగా జవా బు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు వారిని కార్యాలయం లోపలే ఉంచి తాళం వేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తమకు రుణమాఫీ జరిగినట్టు సంఘం నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. తర్వాత తాము ఎలాంటి రుణం తీసుకోలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు కూడా రుణం మాఫీ అయినట్టు తమ ఫోన్లకు మెసేజ్లు రావడంతో ఆరా తీస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.