Rythu Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): రైతు భరోసా వెబ్సైట్లో రైతుల భూములు గల్లంతవుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతుల భూముల వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా, మరికొందరి భూముల వివరాలు సగం మాత్రమే కనిపిస్తున్నాయి. రైతు భరోసా పంపిణీకి పలు సర్వే నంబర్లను బ్లాక్ చేయడమే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సర్వే నంబర్లను బ్లాక్ చేయగా లక్షల ఎకరాలు గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సదరు రైతులకు రైతుభరోసా బంద్ అయింది. ఇప్పటివరకు ప్రభుత్వం రెండెకరాల వరకు జమ చేయగా, ఈ జాబితాలో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. తోటి రైతులకు రైతుభరోసా అందగా, తమకు ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.
సర్వే నంబర్లు బ్లాక్.. భూమి గల్లంతు
వరంగల్ జిల్లాలో ఒక రైతుకు రెండెకరాల భూమి ఉన్నది. ఆ రైతుకు రైతు భరోసా జమ కాలేదు. దీంతో ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాడు. సదరు అధికారి రైతు వివరాలను వెబ్సైట్లో పరిశీలించగా, ఆ రైతుకు అసలు భూమే లేనట్టుగా చూపించింది. దీంతో ఇద్దరూ అవాక్కయ్యారు.
సిద్దిపేట జిల్లాలో మరో రైతుకు ఆరు ఎకరాల భూమి ఉన్నది. వెబ్సైట్లో మాత్రం సదరు రైతుకు నాలుగు ఎకరాలు మాత్రమే ఉన్నట్టుగా చూపిస్తున్నది. వెంటనే సదరు అధికారి క్రాప్బుకింగ్ సర్వేలో పరిశీలించగా, ఆ రైతుకు ఆరు ఎకరాలు ఉన్నట్టు చూపిందని సమాచారం. దీంతోపాటు ఇటీవల నిర్వహించిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వేలోనూ పరిశీలించగా ఆ రైతు భూమి ఆ జాబితాలో లేనట్టు తెలిసింది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, రెవెన్యూశాఖ నుంచి వచ్చిన జాబితాలో పలు సర్వే నంబర్లను బ్లాక్ చేయడమే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. దీనిపై వ్యవసాయ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించగా.. కొన్ని భూములకు సంబంధించి సర్వే చేశామని, వాటిపై అనుమానంతో బ్లాక్లో పెట్టినట్టు చెప్పారని తెలిసింది. దీంతోపాటు నిజాం కాలంనాటి భూముల విషయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పినట్టు సమాచారం.
రైతుల్లో ఆందోళన.. సమాధానం చెప్పేవారు కరువు
వెబ్సైట్లో భూముల వివరాలు తప్పుగా చూపించడంతో తమ భూములు ఏమయ్యాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాటిని సరి చేసుకునేందుకు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎలాంటి సమస్యలేని భూములు ఇప్పుడు హఠాత్తుగా కనిపించకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఒక ఏఈవో ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు బాగానే ఉన్నారని, కానీ పైన జరిగే తప్పులకు తాము శిక్ష అనుభవిస్తున్నామని వాపోయారు.
పాత వాళ్లకు సగమే.. కొత్తవాళ్లకు మొత్తమే లేదు
ఇప్పటివరకు రెండెకరాల రైతులకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, క్షేత్రస్థాయిలో చాలామంది రైతులు తమకు రైతుభరోసా ఎందుకు రాలేదంటూ ఏఈవోలను సంప్రదిస్తున్నారు. రెండెకరాల వరకు సుమారు 40 లక్షల మంది రైతులు ఉండగా, ప్రభుత్వం 30.26 లక్షల మందికి మాత్రమే రైతుభరోసా జమ చేసింది. ఈ యాసంగిలో కొత్త రైతులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వారికి జమ కాలేదని తెలిసింది. మరోవైపు రెండెకరాల వరకే మూడు విడతల్లో వేసిన ప్రభుత్వం.. మొత్తం రైతులకు ఇచ్చేందుకు ఎన్ని విడతలు తీసుకుంటుందో అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.