కొడంగల్, ఏప్రిల్ 18: తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని అప్పాయిపల్లి రైతులు రెండో రోజు శుక్రవారం కూడా ఆందోళన చేపట్టారు. గురువారం భూమిని చదును చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు శుక్రవారం కూడా నిలదీశారు. సర్వే నంబర్ 19లోని అసైన్డ్ భూమిలో ప్రభుత్వం మెడికల్, వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు రైతులు తెలిపారు. ఇందుకుగాను 47మంది రైతులకు సంబంధించి మొత్తం 60 ఎకరాల భూమిని సేకరించినట్టు పేర్కొన్నారు. భూములను ఇచ్చిన రైతులకు ఎకరానికి రూ.10 లక్షల నష్టపరిహారంతోపాటు 125 చదరపు గజాల ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం వంటి హామీని ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. మెడికల్, వెటర్నరీ కళాశాలలు ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి భూములను ఇచ్చినట్టు చెప్పారు.
ఉపాధి కోల్పోతున్నామని తెలిసి కూడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 60 ఏండ్ల నుంచి అన్నం పెడుతున్న భూములను ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తున్నదని, నష్టపరిహారం పూర్తిగా చెల్లించకుండానే పనులు చేపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వే నంబర్ 19లో మొత్తం 47 మంది రైతులు ఉంటే 53 మందికి నష్టపరిహారం ఇచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారని, ఆ ఆరుగురు రైతులు ఎక్కడి నుంచి వచ్చారని నిలదీశారు. కొందరు కాంగ్రెస్ నాయకులే రైతుల ముసుగులో నష్టపరిహారం పొందినట్టు తమ దృష్టికి వచ్చిందని రైతులు తెలిపారు. లగచెర్ల భూములకు ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించిందని, హైవే రోడ్డు వద్ద ఉన్న సర్వే నంబర్ 19 భూములకు కేవలం రూ.10 లక్షల ధర ప్రకటించడం చాలా బాధాకరమని రైతులు వెల్లడించారు. అయినా కూడా ప్రభుత్వం అరకొరగానే నష్టపరిహారం అందించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం తన సొంత నియోజకవర్గ రైతులపై కనికరం చూపి సరైన న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగే వరకూ పనులు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. సోమవారం ఉన్నతాధికారులను కలుస్తామని రైతులు వెల్లడించారు.
గుండె పగిలి.. దవాఖానపాలైతున్నం..
నాకు అప్పాయిపల్లిలో 3 ఎకరాల భూమి ఉంది. కానీ మొత్తంగా రూ.20.25 లక్షలే వచ్చాయి. మిగిలిన పైసలు ఇయ్యలే. బతుకు దెరువు పాయే… పైసలు రాకపాయే.. గుండెలు పగిలి దవాఖాన పాలైతున్నం. సీఎం సారూ.. రైతులను చూడు సారూ.
-నర్సమ్మ, బాధిత రైతు
30 గుంటలకు ఒక్క పైసా ఇవ్వలేదు
నాకు 30 గుంటల భూమి ఉంది. ఇప్పుడు ఆ భూమి పాయే.. పైసలు రాకపాయే. ఏం చెయ్యాలి.. ఎట్లా బతకాలి.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
-సావిత్రమ్మ, కిష్టయ్యగౌడ్ బాధిత రైతులు
రూ.15లక్షలే వచ్చినయ్
మాకు రెండు ఎకరాల భూమి ఉంది. కానీ ఎకరంన్నర భూమి వరకు మాత్రమే రూ.15 లక్షలు ఇచ్చారు. మిగతావి అడిగితే ఇంతే వస్తాయని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం.
-దుబ్బ బుగ్గప్ప, బాధిత రైతు
పొజిషన్లో ఉన్నంత మేరకు నష్ట పరిహారం..
సర్వే నంబర్-19లో పొజిషన్లో ఉన్నంత మేరకు రైతులకు నష్ట పరిహారం అందించడం జరిగింది. భూమిలేని వారికి కూడా నష్టపరిహారం అందించడం జరిగిందని అంటున్నారు. కానీ ఆన్లైన్లోని జాబితా మేరకు రైతులకు అందరికీ నష్ట పరిహారం అందించాము. కొంత మందికి తక్కువ వచ్చిన రైతులకు ఇప్పటికే 10 మందికి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది.
-విజయ్‌కుమార్, తహసీల్దార్ కొడంగల్