జహీరాబాద్, అక్టోబర్ 19 : రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ) శివారులోని వైజయంతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-2 రసాయన పరిశ్రమ ఎదుట పలు గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం మండలంలోని దిడ్గి, తుంకుంటా, బూర్థిపాడ్, కొత్తూర్(బీ) ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి రసాయన పరిశ్రమ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రసాయన పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో మూగజీవులు, ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటు కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్, పట్టణ సీఐ శివలింగం, ఎస్సైలు వినయ్‌కుమార్, కాశీనాథ్ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.