చేవెళ్లటౌన్, మార్చి 28: టమాట పంట రైతుల కంట కన్నీరు (Tomato Price) తెప్పిస్తోంది. దిగుబడి పెరిగి కష్ణాలు తీరుతాయని ఆశించిన రైతులు మార్కెట్లో ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఏడెనిమిది నెలల నుంచి టమాట ధర పతనమై రైతుల జీవితాల్లో తీవ్ర అందోళనను కలిగిస్తున్నది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో రైతులకు కిలో రూ.2 నుంచి రూ.6 మించి పలకడం లేదు. ఈ ధరలతో లాభాల గురించి దేవుడెరుగు కనీసం పెట్టుబడులైన వాస్తే చాలని రైతులు బావిస్తున్నారు. ఆశించిన మేర ధరలు లేకపోవడంతో రైతులు పొలాలోనే వదిలి వేస్తున్నారు. మార్కెట్కు తీసుకొచ్చిన 25 కిలోల టమాట బాక్స్ ధర రూ.50 నుంచి 150 మాత్రమే పలుకుంది. ఈ ధరలతో తమకు గిట్టుబాటు ధర కూడా కావడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. నష్టాలే తప్ప లాభాలు లేవని వాపోతున్నారు. టమాట ఎకరా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులకు రూ.70 నుంచి రూ.80 వేల వరకు రైతులు ఖర్చు చేస్తున్నా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.2నుంచి రూ.6 వరకు ధర పలుకుతుండంతో రైతులకు నష్టాలే తప్ప లాభాలు లేవు. కనీసం 25 కిలోల టమాట బాక్స్ రూ.400 నుంచి రూ.500ల వరకు పలికితే రైతులకు పెట్టుబడితో పాటు లాభాలు వస్తాయి. కానీ చిల్లర వ్యాపారులు మాత్రం కిలో టమాట రూ.10 నుంచి రూ.20 అమ్ముతున్నారు. రైతులకు మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో వ్యవసాయం చేయడానికి వెనుకాడుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
టమాటకు ధరల లేక నష్టపోయిన రైతులు..
టమాట ధరలు మార్కెట్లో ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడే అకు కూరలతో పాటు ఇతర కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుందని మార్కెట్ ఏజెంట్ రాఘవేందర్గుప్తా అన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్లోకి ఎక్కువగా టమాటా రైతులు వస్తుంటారు. ఏడు, ఎనిమిది నెలలుగా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ధరలతో రైతులకు నష్టాలే తప్ప లాభాలు రావని చెప్పారు.
పెట్టిన పెట్టుబడులు రాలేదు..
రెండు ఎకరాల పొలంలో టమాట సాగు చేశానని, కూలీ, రవాణా ఖర్చులు కూడా రాలేవని బందయ్య అనే రైతు వాపోయారు. మార్కెట్లోకి టమాటలు తీసుకొద్దమనుకుంటే రవాణా ఖర్చులు కూడా అధికమయ్యాయి. ధరలు పెరుగుతాయని చూసినా ప్రజయోజనం లేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. టమాట రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.
టమాట వేస్తే అప్పులే మిగిలాయి..
రూ. లక్ష 40 వేల పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల పొలంలో టమాట పంట సాగు చేశానని, పంటదిగుబడి బాగనే ఉంది కానీ ధర మాత్రం లేదని చెర్లగూడేనికి చెందిన వెంకటయ్య అనే రైతు అన్నారు. 25 కిలోల టమాట బాక్స్ రూ.50 నుంచి 150 పడుతుందని చెప్పారు. ఈ ధరకు టమాటలు తెంపితే కనీసం కూలీల ఖర్చులు కూడా మిగలక పోగా చేతి నుంచి డబ్బులు కటిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం టమాట రైతులను ఆదుకోవాడానికి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.