గుమ్మడిదల, మార్చి 23: సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తుండటంతో భూముల రేట్లు పడిపోయాయని, తన ఇద్దరు ఆడబిడ్డల పెండ్లి ఎలా చేయాలని మనోవేదనకు గురై ఓ రైతు గుండె ఆగింది. వివరాల్లోకి వెళ్తే .. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన రైతు నడిమింటి కృష్ణ (53)కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తన అర ఎకరం భూమిలో వ్యవసాయం చేయడంతో పాటు రజక పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు బిడ్డల పెండ్లికి రావడంతో తనకున్న అర ఎకరం భూమిని అమ్మకానికి పెట్టాడు. డంప్‌యార్డు ఏర్పాటు ఎఫెక్టుతో ఎవరూ ఆ భూమి కొనడానికి ముందుకు రావడంలేదు. దీంతో కొద్దిరోజులుగా ఆందోళనకు గురవుతున్న కృష్ణకు ఆదివారం గుండెపోటు రావడంతో నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.
ప్యారానగర్ డంపింగ్ యార్డు రద్దు చేయాలని 47 రోజులుగా నల్లవల్లిలో రిలే దీక్షలు చేస్తున్నారు. ఫిబ్రవరి 15న నడిమింటి కృష్ణ దీక్షలో పాల్గొన్నారు. ఆ రోజు గ్రామస్తులతో తన బాధను పంచుకున్నాడు. తనకు పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, తాను పెండ్లి చేయాలంటే కేవలం తనకున్న భూములే ఆధారమని, కూతుర్ల పెండ్లి కోసం భూమి విక్రయానికి పెట్టినప్పటికీ ఎవరూ కొనడానికి రావడంలేదని ఆందోళన వ్యక్తంచేశాడు. పెద్ద కూతురు మహేశ్వరి డిగ్రీ చదువుతుండగా, రెండో కూతురు మమత ఇంటర్మీడియట్ చదువుతున్నది. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.