Kodangal Farmers | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): తమ భూములను ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని కొడంగల్ రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో మొరపెట్టుకున్నారు. ఈ విషయంలో తమకు అండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో సీఎం సొంత నియోజకవర్గంలోని రైతులు కేటీఆర్‌ను కలిశారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలంలోని హకీంపేట, పోలెపల్లి, లకచర్ల గ్రామాల్లో దాదాపు మూడువేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌కు వివరించారు.
ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతు లు సిద్ధంగా లేరని అండగా నిలవాలని కేటీఆర్‌ను కోరారు. రూ.కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభు త్వం లాకునేందుకు కుట్ర చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తమ కుటుంబాలకు ఈ భూమి జీవనాధా రం అని, వీటిని గుంజుకుంటే జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి,మహిపాల్ ముదిరాజ్ తదితరులు కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
సీఎం అల్లుడి కంపెనీ కోసమేనా?: బీఆర్ఎస్ నేత క్రిశాంక్
కొడంగల్‌లో ఫార్మా కంపెనీలకు 3వేల ఎకరాల భూ సమీకరణపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అనుమానం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. ‘ఏ ఫార్మా కంపెనీ కోసం కొడంగల్‌లో రైతులపై దాడులు చేస్తున్నారు? ఎనుముల ఇంటి అల్లుడికి చెందిన మాక్స్బిన్ ఫార్మా కోసమేనా?’ అని శుక్రవారం ఎక్స్ వేదికగా క్రిశాంక్ ప్రశ్నించారు. కంపెనీకి చెందిన వివరాలను జత చేశారు.