Kotapally Project | పెద్దేముల్, మార్చి 14 : వికారాబాద్ జిల్లాలోని ఒకే ఒక్క మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్‌పల్లి నుంచి ఆయకట్టుకు సాగునీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సాగునీటిని అందించేందుకు కాలువలు, తూముల మరమ్మతులు చేయకపోవడంతో 9200 ఆయకట్టు ఉన్నా కేవలం 500 ఎకరాలకు మాత్రమే నీరందుతున్నది. ఇందులోనూ ఆయకట్టు గ్రామాల పరిధిలోని రైతుల మధ్య సాగునీటి కోసం వివాదం రేగింది. తూములు పాడవడం, కాలువలు దెబ్బతినడంతో వచ్చే కొద్దిపాటి సాగునీటిని ఎవరికి వారు తరలించుకునేందుకు అడ్డుకట్ట వేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిపాటు కేవలం అంచనాలు తయారు చేయడం తప్ప మరమ్మతులు చేసేందుకు నిధులివ్వకుండా ఆయకట్టు కింది రైతుల మధ్య పంచాయితీ పెట్టింది. కోట్‌పల్లి ప్రాజెక్టు ప్రధాన కాలువల ద్వారా ఆయకట్టుకు అధికారులు నీటిని విడుదల చేసినా.. పర్యవేక్షించడంలో విఫలమయ్యారు. దెబ్బతిన్న కాలువల ద్వారా వచ్చే కొద్దిపాటి సాగునీరు తమ పొలాలకే రావాలని దుగ్గాపూర్, కొండాపూర్ గ్రామాల రైతులు ప్రధాన కాలువకు అడ్డుకట్ట వేసి, కేవలం లెఫ్ట్ కెనాల్‌కు మాత్రమే నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అడ్డుకట్టను తొలగించాల్సిందేనని జనగాం రైతులు గొడవకు దిగారు. ప్రాజెక్టు మరమ్మతు పనులు చేయకుండా ప్రభుత్వం విస్మరించడం, మరోవైపు నీటిని వదిలిన ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించక పోవడంతో ఆయకట్టు గ్రామాల రైతుల మధ్య గొడవలకు దారితీసింది.