Kondareddypalli | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘సర్.. నాకు 60 ఏండ్లు. ఇప్పటి వరకు భయం అంటే ఎట్లుంటదో తెల్వదు. కానీ, ఇవ్వాళ భయం అంటే తెల్సింది. మా ఊర్లె ఎన్నడూ ఇట్ల లేకుండె’ అని సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామానికి చెందిన ఓ రైతు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ చెప్పారు. మావోయిస్టులను కూడా చూశామని, మావోయిస్టుల ఎన్కౌంటర్లు కూడా చూశామని, అప్పుడు కూడా ఇట్లా అనిపించలేదని పేరు చెప్పవద్దంటూ ఆ రైతు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ర్టానికి తమ ఊరి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని సంతోష పడాలో గ్రామంలో అందరినీ ఇట్ల వేధిస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఉన్నదని వాపోయారు. ప్రస్తుతం సీఎం సొంత గ్రామంలో ఉన్న భయానక వాతావరణానికి రైతు మాటలు ఒక ఉదాహరణ మాత్రమే. కొన్ని నెలల క్రితం తెలుగు మీడియాకు చెందిన పలువురు మహిళా జర్నలిస్టులు కొండారెడ్డిపల్లికి వెళ్లినప్పుడు అక్కడ చేదు అనుభవాలు ఎదురైన విషయం తెల్సిందే.
సినిమాల్లో చూపించినట్టుగా మహిళా జర్నలిస్టులను వెంటాడి.. వేటాడి ఇబ్బందులు పెట్టిన ఘటన మరువక ముందే మాజీ సర్పంచినే రేవంత్రెడ్డి అన్నదమ్ములు ఇబ్బందులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే గ్రామంలో రేవంత్రెడ్డి బంధువు గురువారెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు కూడా రేవంత్రెడ్డి అన్నదమ్ములే కారణమన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు సాయిరెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోడం, రెండు ఆత్మహత్యలకూ రేవంత్ సోదరులే కారణమనే చర్చ నడుస్తుండంతో గ్రామంలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొన్నది. గ్రామానికి వెళ్లి ఎవరిని మాట్లాడించే ప్రయత్నం చేసినా తలుపులు వేసుకొని భయంతో లోపలే ఉంటున్నారు. గ్రామానికి ఎవరెవరు వస్తున్నారో? తెలుసుకునేందుకు రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కొందరు యువకులను నియమించుకున్నాడు. వాళ్లు నిరంతరం గ్రామానికి వచ్చే వారిని ఆరాతీస్తుంటారు. మీడియా వాళ్లో, మరెవరైనా అయితే వెంటనే అడ్డుకుంటున్నారు. కొంతకాలంగా వారిపై వాదనలకు దిగుతూ వారిపై దాడులకు తెగబడుతున్నారు.
ఆందోళనలో సాయిరెడ్డి కుటుంబం
సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమను గ్రామంలో ఉండనిస్తారో? లేదో అన్న భ యం వారిలో నెలకొన్నది. ఆత్మహత్య గురించి వా ళ్లు మీడియాతో మాట్లాడేందుకూ నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ఇంటి పెద్దాయనను కోల్పోయామని, ఇక తమవల్ల కాదని చెప్తున్నారు. సాయిరెడ్డికి ఇద్దరు కుమారులున్నారు. ఒకరు వారం క్రితమే అమెరికా వెళ్లగా మరో కొడుకు, కూతురు గ్రామంలోనే ఉన్నా రు. సాయిరెడ్డికి కల్వకుర్తిలోనూ ఒక ఇల్లు ఉన్నది. తాత్కాలికంగా కుటుంబం కల్వకుర్తిలో ఉంటున్నది.