హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రైతుల నడ్డివిరిచే నల్లచట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతుల్లో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ కిందామీదా అవుతుంది. రైతుల పేరుతో కార్యక్రమాలను నిర్వహించి వారి మద్దతు కూడగట్టేందుకు పాట్లు పడుతున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు నమ్మే పరిస్థితులు లేవని మంగళవారం నిర్వహించిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంతో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులతో ఇష్టాగోష్ఠి పేరుతో గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమాన్ని హయత్‌నగర్‌లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో రైతులతో సభను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 63 గ్రామాలకు చెందిన రైతులను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం 50 బస్సులను ప్రత్యేకంగా పెట్టారు. రైతుల సమావేశం ఉన్నదని చెప్పి గ్రామాల నుంచి రైతులను సమావేశానికి తీసుకొచ్చారు. సభావేదికపై అంతా బీజేపీ నేతలు కనిపించడంతో ఇది బీజేపీ మీటింగ్‌లా ఉన్నట్టుందని రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమం హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా వేదికగా ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్చువల్ పద్ధతిలో మోదీ ప్రసంగం ప్రారంభం కాగానే రైతులంతా సభాప్రాంగణాన్ని వదిలి బయటకు వెళ్లారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడినప్పుడు కూడా సభా ప్రాంగణంలో రైతులెవరూ కుర్చీల్లో కనిపించలేదు. బీజేపీ కార్యకర్తలు మాత్రమే మిగిలారు. రైతుల సమావేశమని తీసుకొచ్చి ప్రధానమంత్రి ప్రసంగం చూపించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? అంటూ బస్సుల్లో వెంట వచ్చిన అధికారులపై మండిపడ్డారు. బస్సుల్లో తీసుకొచ్చారు.. తీసుకుపోయారు తప్ప…ఇదేం మీటింగో అంటూ రైతులు వాపోయారు.