ఎల్లారెడ్డిపేట, జూన్ 27: రైతు భరోసా, ఆరుగ్యారెంటీలు ఇస్తామంటూ ఊరిస్తున్నట్టుగానే యూరియా యాప్ సైతం తమకు అర్హత ఉన్నదో లేదో ఉత్సుకతతో ఎదురు చూసినట్టు రైతులకు పరీక్ష పెడుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సురభి కాంతారావు అనే రైతు శుక్రవారం యాప్‌లో యూరియా కోసం వివరాలను నమోదు చేస్తే మొదట నెట్వర్క్ ఎర్రర్ అని చూపింది. కొద్ది సేపటికి 31 గుంటల భూమి ఉన్నదని ఇందుకు మొదటి ఫేస్‌లో రెండు బ్యాగులు, అలాగే, అదే రైతుకు మరో చోట 1.39 ఎకరాల భూమి ఉన్నదని అందుకు గాను 4 బ్యాగులకు అర్హత ఉన్నదంటూ సమాచారం వచ్చింది. ఇక తనకు యూరియా వస్తుందని భావించాడు. శనివారం మరో మారు యూరియా కోసం యాప్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయగానే 31 గుంటల భూమికి, 1.39 ఎకరాల భూమికి రెండింటికి అర్హత లేదని మెసేజ్ రావడంతో అదే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో పలువురు రైతులు కూడా తమకు యూరియా యాప్ ఓపెన్ కాకపోవడం, అయినా యూరియాకు సంబంధించిన సరైన సమాచారం రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరుగ్యారంటీల మాదిరిగానే యాప్ కూడా అబద్ధాలా యూరియా యాప్‌గా మారిందని రైతులు మండిపడుతున్నారు.