కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ కౌటాల/నెన్నెల/ తలమడుగు/ గాంధారి/ఆర్మూర్ టౌన్, జూలై 1 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్‌ల ముందు రైతులు బారులుతీరారు. వర్షంలోనూ గంటల తరబడి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేం ద్రంలో రైతులు యూరియా కోసం నిరీక్షించే క్రమంలో తన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా.. మంచిర్యాల జిల్లా నెన్నెలలోని కేంద్రానికి 12 టన్నుల యూరి యా రాగా, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టాపాస్‌బుక్కులు, ఆధార్ కార్డులు పట్టుకొని క్యూకట్టారు. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకునే క్రమంలో పిడిగుద్దులు కురిపించుకొన్నారు.
అనంతరం పోలీసుల పహారా మధ్య రైతులకు టోకెన్లు అందజేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టీ రైతు సహకార కేంద్రం ముందు రద్దీ పెరగడంతో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌటాల, చింతలమానేపల్లి మండల కేంద్రాల్లోని రైతు వేదికల వద్ద రైతులు యూరియా టోకెన్ల కోసం బారులుతీరారు. పట్టా భూములున్న రైతులకు ఎకరానికి రెండు బ్యాగుల చొప్పున ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సీ(బీ) గ్రామంలోని పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. క్యూలో ఆధార్ కార్డులను పెట్టి నిరీక్షించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులు రాస్తారోకో చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని సొసైటీ ఎదుట రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు.