హనుమకొండ, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని రైతాంగానికి వివరించేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాకు వ్యవసాయ శాఖ మంత్రి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా మంగళవారం నుంచి గురువారం వరకు జరుగనున్నది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైతు మేళాను ప్రారంభించారు.
మెగా రైతు మేళాకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హాజరుకాలేదు. వందల స్టాళ్లతో భారీగా ఏర్పాటు చేసిన మేళాకు రైతుల నుంచి స్పందన కరువైంది. వడ్లు, మక్కజొన్న కొనుగోళ్లలో ఇబ్బందుల కారణంగా రైతులు ప్రభుత్వ మేళా విషయంలో ఆసక్తి చూపలేదు. రైతులు రాకపోవడంతో మంత్రులు రెండు గంటలపాటు ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లోనే వేచి చూడాల్సి వచ్చింది. మేళాకు ప్రతి ఊరి నుంచి రైతులను తరలించాలని వ్యవసాయ అధికారులకు రెండు రోజుల క్రితమే టార్గెట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో రైతులు హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు. తీవ్రమైన ఎండలు, వరి కోతల పనుల సమయంలో వ్యవసాయ శాఖ మేళా ఏర్పాటు చేయడం వింతగా ఉన్నదని రైతులు వ్యాఖ్యానించారు. రైతులకు ఉపయోగపడేలా జనవరి, ఫిబ్రవరిలోనే నిర్వహించాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు.
జై శ్రీరాం అంటే పైసలు రాలుతయా..!
మంత్రి కొండా సురేఖ రైతుమేళాలో మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. ‘బీజేపీ నేతలు మీటింగ్‌లు పెట్టుడు.. జై శ్రీరాం అనుడమే పనిగా పెట్టుకున్నారు.. జై శ్రీరాం అంటే పై నుంచి పైసలు పడుతాయా..పథకాలు వస్తున్నాయా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని తీసుకొచ్చి నాలుగు మాటలు మాట్లాడించి పంపిస్తారని విమర్శించారు.