హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనలో అసలు రంగు బయటపడింది. రెండేండ్లకే అన్ని వర్గాలను రాచి రంపాన పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వంపై పగ తీర్చుకునేందుకు వారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో అవకాశం చిక్కింది. రైతుల నుంచి నిరుద్యోగుల వరకు అందరూ ఎదరుచూస్తున్న సమయం రానేవచ్చింది. ఇన్నాళ్లు ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసనను వెల్లడించిన వారంతా ఇప్పుడు ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్ధమయ్యారు.
అందులో భాగంగా బాధితుల తరఫున వారి ప్రతినిధులు జూబ్లీహిల్స్ బాటపట్టారు. ఉప ఎన్నిక బరిలో నిలిచి తామేంటో ప్రభుత్వానికి తెలిసివచ్చేలా చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు రోజుల్లో 127 నామినేషన్లు దాఖలైతే మంగళవారం ఒక్క రోజే 180కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒక పదిమందిని మినహాయిస్తే మిగతా వారంతా బాధితులే, ప్రభుత్వ మోసానికి బలైన వారే కావడం గమనార్హం. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమస్యల పరిష్కారానికి మూకుమ్మడిగా నామినేషన్లు వేసిన అరుదైన ఘటనలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ (ఏఎమ్మార్పీ) ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసి తాగు, సాగునీటిని అందించాలనే డిమాండుతో రైతాంగం జల సాధన సమితిగా ఏర్పడ్డారు.
ప్రభుత్వానికి తమ డిమాండును గట్టిగా వినిపించి, ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో 1996 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నల్లగొండ లోక్‌సభ స్థానానికి మూకుమ్మడిగా రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో రిక్షా తొక్కే రైతు సైతం అక్కడికి వచ్చి నామినేషన్లు వేశారు. దీంతో ఆ ఎన్నికలో ఏకంగా 480 మంది అభ్యర్థులతో జంబో బ్యాలెట్ పత్రం రూపొందించాల్సి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీని బీజేపీ నిలబెట్టుకోలేదనే అసంతృప్తితో పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడంతో 183 మంది అభ్యర్థుల కోసం ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో 50 మంది రైతులు ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసిలో కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం కనిపిస్తున్నది.
జూబ్లీహిల్స్‌లో ఆరు రోజుల్లో 127 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లకు చివరి రోజైన మంగళవారం ఒక్క రోజే 188 మంది నామినేషన్ల దాఖలుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ సంఖ్య 200కు పైగా ఉన్నప్పటికీ వివిధ సాంకేతిక కారణాలు, పోటీని తగ్గించాలనే ఉద్దేశంతో అధికారులు ముందుగానే నామినేషన్ల దాఖలుకు తిరస్కరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలకు సంబంధించిన అలైన్‌మెంట్‌ను రూపొందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ‘ముఖ్య’నేతతో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భూముల్ని కాపాడటం, విలువల్ని పెంచుకునేందుకు దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను మార్చారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు తమకున్న ఎకరం, రెండెకరాల భూముల్ని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వారి ఆవేదనను వినిపించుకోకుండా ముందుకు పోతున్నందున సర్కారుకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పదుల సంఖ్యలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేసింది. భూసేకరణ ప్రక్రియలోని షరతు మేరకు ఫార్మా కోసం ఆ భూముల్ని వినియోగించుకోకపోతే తిరిగి రైతులకు ఆ భూములు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్, భట్టివిక్రమార్క, ఇతర నేతలు రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేస్తున్నారు. కడుపు మండిన ఫార్మా బాధిత రైతులు ఎన్నికలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు నామినేషన్లు వేశారు.
అధికారంలోకి వస్తే ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు అప్పట్లో నిరుద్యోగులను రెచ్చగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పటివరకు రేవంత్ ప్రభుత్వం భర్తీ చేశామని చెప్తున్న సుమారు 68 వేల ఉద్యోగాల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినవి, పరీక్షలు ముగించినవి ఉన్నాయి. కేవలం నియామక పత్రాలను పంపిణీ చేసిన రేవంత్‌రెడ్డి వాటిని కాంగ్రెస్ ఖాతాలో వేశారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్‌లో నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి చిల్లిగవ్వ ఇవ్వడం లేదు. కుటంబ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడంతో పాటు ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. కానీ రేవంత్ ప్రభుత్వ వైఖరి వారిని పిడుగుపాటుకు గురిచేసింది. దీంతో పాటు ఇవ్వాల్సిన డీఏలు, ఇతరత్రా ప్రయోజనాల్ని ఎగవేశారు. దీంతో కడుపుమండిన రిటైర్డ్ ఉద్యోగులు ఆరు పదుల వయసు దాటినా ఓపిక చేసుకొని కాంగ్రెస్‌ను ఓడించేందుకు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆక్రోశంతో మాలలు
ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధంగా చేయకుండా తమను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురి చేసిందని మాలలు ఆక్రోశంతో ఉన్నారు. అనేకసార్లు మీడియా ముందు, ఇతరత్రా రూపాల్లో మాల సంఘం నేతలు తమ ఆవేదన, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. కానీ రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని సదరు నేతలు మండిపడుతున్నారు. బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో ముందుగా ప్రకటించిన మేరకు పెద్ద ఎత్తున వాళ్లు కూడా నామినేషన్లు వేశారు.
అధికారంలోకి వస్తే మైనార్టీలకు అన్నీ చేస్తామంటూ డిక్లరేషన్‌తో మభ్య పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ప్రయోజనాలను దెబ్బ తీసిందనే కోపం మైనార్టీల్లో తీవ్రస్థాయిలో ఉన్నది. పలువురు మైనార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు సికింద్రాబాద్, మేడ్చల్ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ భూ బాధితులు కూడా ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్లు కాకుండా ప్రచారపర్వంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తామని బాధిత సంఘ ప్రతినిధులు చెప్తున్నారు. ఇలా ఇంకా ఇతర రంగాలు, వర్గాల వారు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్లు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించనుందని పరిశీలకులు భావిస్తున్నారు.
చిక్కడపల్లి, అక్టోబర్21: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో చివరిరోజు మంగళవారం నిరుద్యోగి అస్మా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చిక్కడపల్లి లైబ్రరీ నిరుద్యోగులు హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం అస్మా మాట్లాడుతూ.. నిరుద్యోగులకు కాం గ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో జూబ్లీహిల్స్ ప్రజలు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కయ్య వెంకటేశ్, శంకర్‌నాయక్, బాలకోటి, ఇంద్ర, మోతీలాల్, నవీన్ పట్నాయక్, శంకర్ పాల్గొన్నారు.