నమస్తే తెలంగాణ నెట్వర్క్ : సాగునీటి ఇక్కట్లపై పదిహేను రోజులుగా సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని రామోజీతండా పరిసర ప్రాంతాల్లో ఎస్సారెస్పీ 71 డీబీఎం 22ఎల్ కెనాల్ కింద సాగు చేసే రైతులు 300 మంది సోమవారం చివ్వెంల – ముకుందాపురం ప్రధాన రహదారిపై పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో కాళేశ్వరం 15 ప్యాకేజ్ ద్వారా గొలుసు కట్టు చెరువులు నింపి సాగు జలాలు అందించాలని కోరుతూ రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
మండలంలోని చెరువులన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటాయని, నాట్ల దశలోనే పంటలు ఎండిపోతున్నాయని జల సాధన సమితి మండల అధ్యక్షుడు జశ్వంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తలాపునే పారుతున్న కాళేశ్వరం నీళ్లను చెరువులోకి మళ్లించి ఆదుకోవాలని కోరారు.
రుణమాఫీ కాలేదని బ్యాంకు ఎదుట నిరసన
రుణమాఫీ కాలేదంటూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ పరిధిలోని సెంటినరికాలనీ కేడీసీసీ బ్యాంకు ఎదుట సోమవారం పలువురు రైతులు బైఠాయించారు. రుణమాఫీ అయిందని పేర్లు ప్రకటించినా తమ ఖాతాలో జమ కాలేదని వాపోయారు. రెండు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జాబితాలో పేర్లు ఉన్నా రుణమాఫీ విషయంలో అయెమయానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 మందికిపైగా రైతులకు రుణమాఫీ కాలేదని, ఇప్పటికైనా అధికారులు రుణమాఫీ డబ్బులు జమ చేయాలని కోరారు.
– రామగిరి
రెగ్యులరైజ్ చేయాలని..
విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్లకు కన్వర్షన్ ఇచ్చి రెగ్యులర్ ఉద్యోగులగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రం సర్కిల్ కార్యాలయం ఎదుట దీక్షలు ప్రారంభించారు. 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఐదు నెలలుగా ఆందోళనలు చేపట్టినా నేటికీ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-దోమలపెంట
‘డబుల్’ ఇండ్ల కోసం ఆందోళన
డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పేదలు ఆందోళనకు దిగారు. సోమవారం మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నెల 26వ తేదీ తర్వాత అర్హులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు.
– మహబూబ్నగర్
పవర్లూం కార్మికుల ధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పవర్లూం వర్కర్స్ యూనియన్ నాయకులు చేనేత కార్మికులతో కలిసి సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల 10 శాతం యారన్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు రోజుకు రూ.వెయ్యి వేతనం వచ్చేలా కూలీ నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
– సిరిసిల్ల కలెక్టరేట్