CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదని, కొన్నిచోట్ల రైతులు ఒకే కంపెనీకి చెందిన విత్తనాలు కావాలనుకోవడం వల్ల సమస్య వస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. స్టాక్ లేనప్పుడు క్యూలో చెప్పులు పెడితే విత్తనాలు వస్తాయా? అని ప్రశ్నించారు. డిమాండ్‌కు అదనంగా 10శాతం విత్తనాలు, ఎరువులను అధికంగా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు కొరత లేదని, అక్కడక్కడ కరెంట్‌కు అంతరాయం కలుగుతున్నది తప్ప కోతలు ఉండటం లేదని పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి అవసరమని, అందుకే తాను అక్కడికి వెళ్లలేకపోయానని తెలిపారు. గన్‌పార్క్ వద్ద ఎక్కడా ముళ్లకంచెలు వేయలేదని స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మను చంపిన రాజులుగానే కాకతీయులను చూస్తానని, అందుకే తాను సమ్మక్క, సారలమ్మవైపే ఉంటానని తేల్చి చెప్పారు. తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం తీసివేస్తారనే ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా సీఎం పైవిధంగా స్పందించారు.
‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంపై అన్ని విషయాలను అందెశ్రీ మాత్రమే చెప్పాలని పేర్కొన్నారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సచివాలయం నుంచే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని, తొలుత సీఎం, సీఎస్‌లకు అమలు చేసి ఆ తర్వాత కిందిస్థాయి ఉద్యోగులకు అమలు చేస్తామని వివరించారు. అమరవీరులను గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేస్తామని, వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు తెలిపారు. బీజేపీని విస్మరించలేదని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవతరణ వేడుకలకు కేసీఆర్ రావాలని కోరారు.
పాకిస్థాన్ చేసుకున్నట్టు ముందే వేడుకలు
భారతదేశ స్వాతంత్య్రం విషయంలో పాకిస్థాన్ ఒకరోజు ముందుగానే వేడుకలు చేసుకుంటున్నట్టు కేసీఆర్ కూడా ఒక రోజు ముందే వేడుకలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు తన నేతృత్వంలో జరగడం తనకు జీవితకాలపు గుర్తు అని పేరొన్నారు.
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారమని రేవంత్ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ 9-10 ఎంపీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలుస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే మరో రెండు గంటలు ఎకువగా పనిచేస్తానని పేర్కొన్నారు. తమ 100 రోజుల పాలన రెఫరెండంపైనే ఓట్లు పడ్డాయని తెలిపారు. త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగుస్తుందని, ప్రముఖ నాయకుడే కొత్త అధ్యక్షుడు అవుతారని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అధిష్ఠానానిదే ఫైనల్ నిర్ణయమని తేల్చి చెప్పారు.
రైతుభరోసాపై అసెంబ్లీలో నిర్ణయం
రైతుభరోసా అమలుపై అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. అర్హులైన రైతులకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని తేల్చిచెప్పారు. కాళేశ్వరం, మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్య, క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బీసీ కులగణన చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని, త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం డ్రగ్స్‌ను కంట్రోల్ చేయడమేనని తెలిపారు. కొత్త మద్యం బ్రాండ్లపై స్పందించిన సీఎం గతంలో కేసీఆర్ 80 కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.