కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది. ఇంత జరుగుతున్నా రేవంత్‌రెడ్డి సర్కారు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకుంటే.. ఇదేం ఖర్మరా? అని మదనపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నదని గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ కేసీఆర్ సారే రావాలని కోరుకుంటున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
కొణిజర్ల, సెప్టెంబర్ 20 : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గోపవరం సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులతోపాటు 80 ఏళ్ల వృద్ధురాలు సైతం వచ్చింది. శుక్రవారం నుంచి వరుస క్రమంలో పాస్ పుస్తకాలు పెట్టిన రైతులకు శనివారం యూరియా పంపిణీ చేశారు. చేతికర్ర సాయంతో క్యూలో నిల్చున్న వృద్ధురాలు తన సీరియల్ నంబర్ రాకపోవడంతో ఓపిక లేక మెట్లపై కూర్చుంది. తన కొడుకు వరి సాగు చేశారని, యూరియా బస్తా ఒక్కో మనిషికి ఒక్కో కట్టే ఇస్తుండడంతో తాను కూడా రావాల్సి వచ్చిందని వాపోయింది.
తొర్రూరు, సెప్టెంబర్ 20 : యూరియా బస్తాలు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ బస్సులో పంపిణీ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. హైదరాబాద్ ఘట్కేసర్కు చెందిన రామావత్ వెంకన్న తన తండ్రి రామావత్ భీమ్లా (సీత్యాతండా, పర్వతగిరి మండలం) కోసం మూడు యూరియా బస్తాలను టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా బస్సులో శనివారం తొర్రూరుకు పంపించాడు. స్థానికంగా యూరియా దొరకకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వెంకన్న తెలిపారు. తన తండ్రి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడినా యూరియా దొరకలేదు. ఘట్కేసర్లో తనకు సాగుభూమి ఉండడంతో రైతు సేవ కేంద్రం నుంచి మూడు యూరియా బస్తాలు కొనుగోలు చేసి తన తండ్రికి కార్గో ద్వారా పంపించినట్లు తెలిపారు.
వేరుశనగ విత్తనాలకు బారులు
దామరగిద్ద, సెప్టెంబర్ 20: యూరియా బాధలు తీరాయనుకున్న రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడుతున్నారు. శనివారం నారాయణపేట జిల్లా దామరగిద్ద రైతు వేదిక వద్ద వేరుశనగ విత్తనాల కోసం క్యూ కట్టారు. రైతు వేదికకు 1200 బస్తాల విత్తనాలు వచ్చాయి. విషయం తెలసుకున్న రైతులు తెల్లవారుజామున 5 గంటలకే చేరుకొని సాయంత్రం 4:30 గంటల వరకు నిరీక్షించారు. అయినా విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో చివరకు నిరాశతో వెనుతిరిగారు.
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 20 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండలం భూపాలపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి అక్రమంగా యూరియాను విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని కాగజ్‌నగర్‌లోని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సిర్పూర్(టీ) వ్యవసాయశాఖ అధికారి భూక్యా గిరీషన్ను వివరణ కోరగా కాగజ్‌నగర్‌లోని కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీకి ప్రభుత్వం యూరియా స్టాక్‌ను అలాట్మెంట్ చేసిందని తెలిపారు. అక్కడి నుంచి భూపాలపట్నంలోని వెంకటేశ్‌కు చెందిన శ్రీనివాస ఫర్టిలైజర్ షాపునకు తరలించారని చెప్పారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా అర్ధరాత్రి షాపు వద్ద యూరియా విక్రయిస్తుండగా సిర్పూర్(టీ) ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలోపోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఫర్టిలైజర్ షాపులో స్టాక్ సేల్‌ను నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
పరకాల, సెప్టెంబర్ 20 : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి అన్నంపెట్టే రైతులను నిండా ముంచిందని, సీఎం రేవంత్ అసమర్థ పాలనవల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు కల్యాణపు రాజమొగిలి(రవి) శుక్రవారం యూరియా టోకెన్ కోసం మండలంలోని వరికోల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రైతు హనుమకొండలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా, ఆయనను ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రెండు, మూడు గ్రామాలు తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను దకించుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం బయలుదేరిన రైతులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ధ్వజమెత్తారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. రైతులు అధైర్య పడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కౌటాల, సెప్టెంబర్ 20 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రికి రాత్రే రెండు లారీల యూరియాను స్టాక్ మాయమైంది. కౌటాల మండలం శిర్షా గ్రామంలోని ఆంజనేయ ట్రేడర్స్, కొండయ్య ట్రేడర్స్ యజమానులు అల్లి తిరుపతి, మల్లేశ్ మంచిర్యాల జాహ్నవి ట్రేడర్స్ నుంచి 266 చొప్పున మొత్తం 532 యూరియా బ్యాగులను రెండు లారీల్లో శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఒక్కో యూరియా బ్యాగుకు రూ.1200 వరకు విక్రయించినట్టు రైతులు ఆరోపించారు. శనివారం ఉదయం మండల వ్యవసాయాధికారిని ప్రేమలత విషయం తెలుసుకొని దుకాణాల యజమానులకు ఫోన్ చేయగా రాత్రే మొత్తం రైతులకు పంపిణీ చేశామని సమాధానం ఇచ్చారు. ఆమె వెంటనే సిబ్బందితో కలిసి దుకాణాల వద్దకు వెళ్లి తనిఖీ చేయగా ఆంజనేయ ట్రేడర్స్‌లో 72, కొండయ్య ట్రేడర్స్‌లో 46 యూరియా బ్యాగులున్నట్టు గుర్తించి ఏడీఏ మనోహర్‌కు సమాచారమిచ్చారు. వాటిని నో సేల్కింద రాశారు.