హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : జొన్న పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. శనగ కొనుగోళ్లను మధ్యలోనే వదిలేసింది. ఇక పరిమితంగానే మక్కలను కొంటున్నది. ధాన్యం కొనుగోళ్ల సంగతి సరేసరి. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలనలో పంటల కొనుగోళ్ల దుస్థితి. పంటల కొనడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఆగమవుతున్నారు. రోడ్లెక్కి ధర్నాల చేస్తున్నా పట్టించుకోకపోవడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. గురువారం జరిగే రాష్ట్ర క్యాబినెట్ భేటీలోనైనా పంట కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నదని, అందుకే కొనుగోళ్లకు ముందుకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. మార్క్‌ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేయాల్సిన సర్కార్.. ఇప్పుడు చేతులెత్తుస్తున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
జొన్న కొనుగోళ్ల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగవుతుంది. ప్రభుత్వం కొనుగోళ్ల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు కొనుగోలు చేస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 4లక్షల ఎకరాల్లో జొన్న సాగు కాగా సుమారు 9లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు గింజ కూడా కొనలేదు. మార్కెట్లో ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జొన్నలకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,699 ఉండగా మార్కెట్లో రూ.2వేల వరకే ధర ఉన్నది. రైతులు క్వింటాల్‌కు రూ.1,699 నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే జొన్నలు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో ప్రతి పంటనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, మద్దతు ధరకు అదనంగా బోనస్ కూడా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చాక పంటలు కొనడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నది. ఇందులో భాగంగానే పంటల కొనుగోళ్ల కోసం కేంద్రం వైపు చూస్తున్నది. పంటలు కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నది. ఇలా కేంద్రానికి లేఖ రాస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోళ్ల నుంచి తప్పించుకుంటూ చేతులెత్తుస్తున్నది. శనగలకు కేంద్రం 29వేల టన్నులకు అనుమతిచ్చింది. ఇప్పుడు ఆ కోటా పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ కోటాలో కొనుగోలు చేయాలి. కానీ తమకు సంబంధం లేదన్నట్టు శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మార్క్‌ఫెడ్ శనగల కొనుగోళ్లను మధ్యలోనే నిలిపేసింది. ఇక మక్కల కొనుగోళ్లలోనూ అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 30లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 2లక్షల టన్నులే కొనుగోలు చేసింది. మక్కలు అధికంగా కొనుగోలు చేస్తే సర్కార్‌పై ఆర్థిక భారం పడుతుందట. ఇది సర్కార్ పెద్దలే మార్క్‌ఫెడ్ అధికారులకు చెప్పారని సమాచారం. దీంతో అధికారులు సైతం పెద్దల మాటలు కాదనలేక.. కొనుగోళ్లను పరిమితం చేస్తున్నారు. రైతులు రోడ్డెక్కినా, ధర్నాలు చేసినా, ఆత్మహత్యలు చేసుకున్నా.. ఇవేవీ సర్కార్‌కు పట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఏమైపోయినా పర్వాలేదు.. కానీ సర్కార్‌పై ఆర్థిక భారం పడొద్దనే ఒకే దురాలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలిసింది.