వర్ధన్నపేట, నవంబర్ 7: ‘నెల రోజులు దాటినా ఇంతవరకు వడ్లు కొంటలేరు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకపోదామన్నా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మా సమస్యలు ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు’ అని రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో మొరపెట్టున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో గురువారం ఎర్రబెల్లి పర్యటించారు. గ్రామ సమీపంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు సమస్యలను దయాకర్రావుతో పంచుకున్నారు.
ఎర్రబెల్లి: ధాన్యం ఇక్కడే ఉన్నది.. అమ్ముకోలేదా ఇంకా?
రైతు ఆబర్ల రాజు: కాంటాలు అయితలేవని ఇక్కన్నే ఆరబోసుకున్నం. 15 రోజులైతాంది వడ్లు తీసుకొచ్చి. ఏం చెయాలె సారు. ప్రైవేటుకు అమ్ముదామనుకుంటానం.
రైతు అనిమిరెడ్డి మల్లారెడ్డి: కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొంటలేరు. మిల్లులు అలాట్ కాకపోయే సరికి కొంటలేమని చెబుతాండ్లు. కొబ్బరికాయ కొట్టి కేంద్రాన్ని ప్రారంభించి 15 రోజులు దాటినా ఇంతవరకు ఒక్క గింజా కొనలేదు. ఏమిచెయ్యాలె. అందుకే ఇక్కన్నే ఉంచినం.
ఎర్రబెల్లి: 500 బోనస్ ఇస్తమంట్లాండ్లు కదా?
రైతు బొంతల కుమారస్వామి: ఇంతవరకు కొనుగోళ్లే ప్రారంభం చెయ్యలేదు. రూ.500 బోనస్ ఇచ్చుడెక్కడిది. అన్ని ఒట్టి మాటలు చెప్పుకుంట కాలం వెళ్లదీస్తాండ్లు. ఆరబెట్టుకొని రావాలే అంటాండ్లు. మొత్తం ధాన్యం ఎండి ఉన్నది. ఇంకా ఎంత ఆరబెట్టాలె.. ఏమిచెయ్యాలె సారు..
ఎర్రబెల్లి: రుణమాఫీ అయ్యిందా?
రైతు అడుప రాజు: రుణమాఫీ కాలేదు సార్
ఎర్రబెల్లి: రైతుబంధు వచ్చిందా?
రైతు కుమారస్వామి: రైతుబంధు ఇంక వత్తదా సార్. యాసంగి వరి నాట్లు పోసినంక ఇస్తామంటాండ్లు కదా. ఇత్తరో లేదో తెలువది. ఏమి చెయ్యాలె.. ముఖ్యమంత్రియి మాటలే అయితానై.. చేతలు ఎక్కడ కూడా లేవు.
ఎర్రబెల్లి: మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వడ్లు మొత్తం కొంటామని చెబుతండ్లు కదా?
రైతులు: కొనుడులేదు మన్నులేదు. ధాన్యాన్ని మూడు సార్ల వడ్లు తూర్పార బట్టాల్నట. గింజల సైజును కూడా కొలిసిన తరువాతనే కొనుగోలు చేస్తరట. అయన్నీ మేమెక్కడ చేసేది. దీనంతటికంటే బయట ప్రైవేటుకే అమ్ముకోవడం ఉత్తమం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుంట వడ్లు అమ్ముకున్నం. రైతుబంధు సమయానికి వచ్చింది. ఇప్పుడు ఏదీలేదు. ఏమి చెయ్యాల్నో తెలుత్తలేదు.