త్రిపురారం, సెప్టెంబర్ 6 : షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం రైతు వేదిక ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి అన్నదాతలు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు, త్రిపురారం మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. 35 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లలో పేర్లు తప్పు ఉన్నాయని, ఎక్కువగా ఉన్న వడ్డీ డబ్బులను చెల్లించాలని, లేనట్లయితే రుణమాఫీకి అర్హులు కాకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీపై అధికారులకు పూర్తి స్పష్టత లేదని, బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. రోజూ మండల కేంద్రానికి ఐదారు వందల మంది రైతులు వస్తున్నారని, వారి గోడును వినలేకే బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ధర్నా చేపట్టినట్టు తెలిపారు.