గద్వాల, మే 12 : ధాన్యం కొనుగోళ్ల పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రైతులు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు కుర్వ పల్లయ్య మాట్లాడుతూ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు నిర్వాహకులతో కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. క్వింటాకు రెండున్నర కిలోల తరుగు తీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోచుకుంటున్నదని మండిపడ్డారు. ఈ విషయాన్ని పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. వెంటనే రైతులకు గన్నీ బ్యాగులు అందజేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చే శారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌ను కలిసి అయిజ మండలంలోని రాజపురం, పులికల్, బైనపల్లి తదితర కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీపై వినతిపత్రం అందజేశారు.
విదేశీ విత్తనోత్పత్తి కంపెనీల ద్వారా నష్టపోయిన వెంకటాపురం(నూగూరు), వాజేడు మండలాలకు చెందిన మక్కజొన్న రైతులు సోమవారం ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నాచేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ వన నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్స నర్సింహమూర్తి మాట్లాడుతూ.. రెండు మండలాల్లో 900 మంది మక్కజొన్న రైతులు ఆయా కంపెనీల విత్తనాల ద్వారా పంట దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. ఎకరానికి రూ. లక్షా 50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
– ములుగురూరల్