శాయంపేట, మార్చి 5: రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్‌ను రైతులు అడ్డగించారు. శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో పంప్‌హౌస్ పరిశీలనకు ఆయన అధికారులతో కలిసి బుధవారం వెళ్లారు. చలివాగు నుంచి ధర్మసాగర్‌కు నీళ్లు ఎత్తిపోయడం వల్ల బ్యాక్‌వాటర్ తగ్గిపోయి తమ పంటలు ఎండిపోతున్నాయని మైలారం, హుస్సేన్‌పల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ‘మా ప్రాంతంలోని నీళ్లను మీరెట్ల తీసుకుపోతరు. మా పంటలను ఎండబెట్టి నీళ్లు తీసుకుపోతే ఊరుకునేది లేదు’ అని మండిపడ్డారు. దీంతో ఒక మోటరును బంద్ చేయాలని ఇరిగేషన్ ఈఎన్సీ అధికారులకు సూచించడంతో రైతులు శాంతించారు.
నీరందక ఎండుతున్న పంటలు
చలివాగు బ్యాక్‌వాటర్ కింద మైలారం, హుస్సేన్‌పల్లి తదితర గ్రామాల రైతులు సైఫన్లు పెట్టి వందలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. భీంఘన్‌పూర్ నుంచి చలివాగులో గోదావరి జలాలను పోస్తూ.. అక్కడి నుంచి ధర్మసాగర్‌కు పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవాదుల పంప్‌హౌస్ నుంచి రెండు మోటర్లతో నిరంతరం ధర్మసాగర్‌కు నీళ్లు పంపింగ్ చేస్తున్నారు. దీంతో బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి సాగు చేసిన పంటలకు నీరందక మోటర్లు కాలిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం రైతులు ధర్మసాగర్ పంపింగ్ మోటర్లు బంద్ చేయాలని ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, వరంగల్ సీఈ అశోక్‌కుమార్, ఎస్ఈలు వెంకటేశ్వర్, మోహన్‌రావు కలిసి బుధవారం చలివాగు పంప్‌హౌస్ వద్దకు వెళ్లారు. మోటర్ల పంపింగ్, నీటి లిఫ్టింగ్, భీంఘన్‌పూర్ నుంచి వస్తున్న జలాలు, పంపింగ్ తదితర అంశాలపై అధికారులతో ఈఎన్సీ చర్చించారు.
రికార్డులను పరిశీలించారు. జనగామ ప్రాంతానికి తాగునీటి సమస్యలు వస్తున్నందున ధర్మసాగర్ రిజర్వాయర్‌కు పంపింగ్ జరగాలని సూచించినట్టు తెలిసింది. అనంతరం చలివాగు ప్రాజెక్టుతూమును ఈఎన్సీ, సీఈలు పరిశీలించారు. తూము నుంచి వెళ్తు న్న జాలుకాలువ నీళ్లను వెంటనే బంద్ చేయాలని ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆదేశించారు. ఈఎన్సీ వచ్చిన విషయం తెలుసుకున్న మైలారం, హుస్సేన్‌పల్లి రైతులు పంప్‌హౌస్ వద్దకు చేరుకొని వారిని అడ్డుకున్నారు. తమ పంటలు ఎండిపోతున్నాయని మోటర్లను బంద్‌చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందులున్నాయని రెండు రోజు ల తర్వాత మోటర్లు బంద్ చేయిస్తామని ఈఎన్సీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో తమ పంటలు ఎండబెట్టి నీళ్లు ఎట్ల తీసుకుపోతరని రైతులు మండిపడ్డారు. చలివాగులో 15 ఫీట్ల నీళ్లు ఉంచిన తర్వాతే ధర్మసాగర్‌కు తరలించాలని గతంలో నిర్ణయం జరిగిందని రైతులు వివరించారు. ధర్మసాగర్‌కు నీటిని తీసుకెళ్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు.