ఇచ్చోడ/రామారెడ్డి/అమరచింత, జూన్ 19 : యూరియా యాప్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. యాప్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్లోని రైతు వేదికలో అన్నదాతలు నిరసనకు దిగారు. యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని నినదించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే పాలకులు రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో రైతులు వ్యవసాయ క్షేత్రంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తే.. యూరియా ఇంటికి వచ్చేదని అన్నారు. కానీ ఇప్పుడు యూరియా కోసం రేవంత్‌రెడ్డి సర్కార్ యాప్‌ను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ మీనాక్షి, రైతులు తిరుపతి, విఠల్, దత్త, వెంకటి, సంతోష్, శంకర్, మారుతి, సుభాష్ పాల్గొన్నారు.

యూరియా కోసం ఎరువుల దుకాణానికి వెళ్తే అవసరం లేని నానో యూరియాను అంటగడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని బషీర్ ఎరువుల దుకాణంలో యూరియా బస్తాలు బుక్ చేసుకొని, శుక్రవారం తీసుకొనేందుకు వెళ్లగా రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని నానో యూరియాతోపాటు ఇతర ఎరువులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు తొలగించి తగిన మోతాదులో అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.