హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రైతుభరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు ఇవ్వడమేంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో రైతుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్నది. ఏ ఇద్దరు రైతులు కలిసినా.. రైతుభరోసా కోతలపైనే ప్రధానంగా చర్చించుకుంటుడటం గమనార్హం. కాంగ్రెస్ సర్కారును నమ్ముకుంటే నయవంచన చేసిందంటూ రైతులు మచ్చటిస్తున్నారు. ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతుభరోసా విషయంలోనూ అదే విధంగా మోసం చేసిందని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కోతలు తప్ప.. కడుపు నింపే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధ్యం కాకపోతే.. హామీ ఎందుకు ఇచ్చారు?
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ వెనక్కి తీసుకొని, మాట మార్చడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైతుభరోసా కోతలపై సీఎం రేవంత్రెడ్డి చెప్పిన ఆర్థిక కారణాలపై రైతులు మరింత గుర్రుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఈ విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. హామీ అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ వాగ్దానం చేశారా? అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎన్నికలకు ముందే తమను మోసం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ వేసుకున్నదా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోకుండానే హామీలు గుప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే హామీ ఎందుకు ఇచ్చారంటూ నిలదీస్తున్నారు.
భరోసాలోనూ కోతలా?
ఈ నేపథ్యంలో మోసం చేసేందుకు కాంగ్రెస్ సర్కారుకు రైతులే దొరికారా? అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు పథకాల్లో కోత పెట్టడమే లక్ష్యంగా హస్తం ప్రభుత్వం పని చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీలో కోతలు పెట్టి దాన్ని చేయకుండానే చేతులు దులిపేసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు రైతుభరోసాలోనూ కొర్రీలతో కోతలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కొందరికి మాత్రమే మాఫీ చేసిందని మండిపడుతున్నారు. ఇక రైతుభరోసా విషయానికొస్తే రూ.15 వేల హామీని తుంగలో తొక్కి రూ.3 వేలు కోత పెట్టి.. రూ.12 వేలకే పరిమితం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ కోత చాలదన్నట్టు సాగు చేసిన భూములకే ఇస్తామంటూ మరో కోత కార్యక్రమాన్ని ముందటేసుకుందని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా రైతులపై కక్ష సాధింపును కాంగ్రెస్ సర్కారు బంద్ చేయాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి కోతలు లేకుండా ఎకరానికి రూ.15 వేలు భరోసా ఇవ్వాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.