హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యాన రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. నిరుడు కేజీ రూ.200 పలికిన నిమ్మ ధర ప్రస్తుతం రూ.20కు పడిపోయింది. పోయిన సీజన్లో రూ.2000 కు అమ్ముడుపోయిన బస్తా నిమ్మకాయలకు.. ఇప్పుడు అందులో సగం ధర కూడా లభించే పరిస్థితి లేదు. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెడితే కూలి, రవాణా ఖర్చులు వచ్చే పరిస్థితి లేదని రైతులు విలపిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో బత్తాయి, 35 వేల ఎకరాల్లో నిమ్మ సాగవుతున్నట్టు ఉద్యానశాఖ లెక్కలు చెప్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిమ్మ సాగును దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం నకిరేకల్‌లో ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు దళారులు, వ్యాపారులను కట్టడి చేయడంలేదని రైతులు మండిపడుతున్నారు. నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దళారుల ఆగడాలను అరికట్టి, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.