బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు.
గత 24 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సివస్తూనే ఉన్నది. యూరియా వచ్చిందని తెలియగానే అన్నదాతలు తెల్లవారుజాము నుంచే బారులుతీరుతున్నారు. వచ్చిన అరకొర యూరియాను పోలీసుల పహారాలో అందజేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎరువుల కోసం తమను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. మళ్లీ కేసీఆర్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట రైతు వేదిక వద్ద యూరియా కూపన్లు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం వరకు కూపన్ల కోసం పడిగాపులు కాశారు.
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఏల్పుగొండ సొసైటీ వద్ద యూరియా కోసం ఉదయం నుంచే బారులు తీరిన రైతులు, మహిళలు
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ఎగబడుతున్న రైతులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఆధార్, పాస్బుక్ల జిరాక్స్‌లను ఏవో వీరాసింగ్ విసిరేయగా ఏరుకుంటున్న రైతులు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో యూరియా కోసం బారులుతీరిన అన్నదాతలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన రైతులు యూరియా కోసం సిరిసిల్ల-కోనరావుపేట ప్రధాన రోడ్డుపై బైఠాయించారు
తెలంగాణకు చెందిన యూరియాను ఆంధ్రాకు తరలించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల పరిధి మల్లేశ్వరం, మంచాలకట్ట సమీపంలోని కృష్ణానది తీరంలో ఆదివారం చోటుచేసుకున్నది. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో కొంత కాలంగా యూరియా బస్తాలను గుట్టుచప్పుడు కాకుండా మరబోటులో రాయలసీమకు తరలిస్తున్నారు. కొల్లాపూర్, పెంట్లవెల్లిలోని ఫర్టిలైజర్ షాపుల యజమానులతో చేతులు కలిపి యూరియాను రాయలసీమకు తరలిస్తున్నారు. మంచాలకట్ట నుంచి కొండపాటూరు, కొరిదెల, ముచ్చుమర్రికి.. మల్లేశ్వరం నుంచి కపిలేశ్వరం, మాడుగుల, కొత్తపల్లికి యూరియా తరలిస్తున్నారు.
– పెంట్లవెల్లి