రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాగు సంబురంగా చేసుకుందామనుకున్న రైతన్నలకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరలేదు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఒకటి, రెండు బస్తాలు మాత్రమే చేతికందుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని, సకాలంలో యూరియా తెప్పించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. ఇలా చేస్తే తాము పంటలెలా పండిచుకోవాలని, సీఎంతో పాటు మంత్రులెవరూ తమ ఇక్కట్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతున్నది. మంగళవారం ఎక్కడ చూసినా విక్రయ కేంద్రాల వద్ద రైతుల బారులే కనిపించాయి. పలుచోట్ల వర్షం పడుతున్నా అన్నదాతలు లైన్లలో బారులు తీరారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కలలో యూరియా కోసం వర్షంలో గొడుగులు పట్టుకొని నిల్చున్న రైతులు
ఏం జరిగింది: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని నేరెళ్ల సింగిల్‌విండో గోదాముకు మంగళవారం సాయంత్రం ఒక లారీ లోడ్ యూరియా చేరుకుంది. బుధవారం ఉదయాన్నే యూరియా అందజేస్తామని సిబ్బంది ప్రకటించారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే సింగిల్‌విండో గోదాం వద్ద 100 మందికి పైగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. మూడు రోజులుగా యూరియా కోసం వేచిచూస్తున్నామని, ఒక్క లోడ్ మాత్రమే పంపించారని మండిపడ్డారు. బస్తాల కోసం క్యూలైన్లో ఉండి ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌లను అందించి నంబర్లు వేయించుకున్నారు. వాటికి కాపలాగా పలువురు రైతులు గోదాం వద్దే మకాం వేశారు.
ఏం జరిగింది: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి పదిహేను రోజులుగా యూరియా రావడం లేదు. పీఏసీఎస్ కార్యాలయంతోపాటు కోరమండల్ ఇంటర్నేషనల్ షాపు, హాకా రైతు సేవా కేంద్రం, కిసాన్ సమృద్ధి కేంద్రం, ప్రైవేట్ ఎరువులు, మందుల దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో యూరియా ఎప్పుడొస్తదని రైతులు ఆరా తీస్తున్నారు.
ఏం జరిగింది: సిద్దిపేట జిల్లాలోని తొగుట వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల పాటు నిల్చుంటే పట్టా పాస్బుక్కు రెండు యూరియా బస్తాలు మాత్రమే నిర్వాహకులు ఇచ్చారు. చాలామందికి ఒక్క బస్తా కూడా దొరకలేదు. దీంతో వారంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏం జరిగింది: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని గంటల తరబడి నిరీక్షించారు. బస్తాలు సరిపడా అందుబాటులో లేకపోవడంతో, కొందరికి అందలేదు. దీంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో లేని యూరియా కష్టాలు ఇప్పుడెందుకు వచ్చాయంటూ మండిపడ్డారు.
ఏం జరిగింది: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుద్రంగి రైతు వేదిక వద్ద ఆగ్రో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేయగా, ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. 230 యూరియా బస్తాలు మాత్రమే ఉండటంతో ఒక్కొక్కరికి ఒక బస్తా మాత్రమే పంపిణీ చేశారు. మూడు రోజుల నుంచి నిరీక్షించినా యూరియా దొరకలేదని కొందరు రైతులు నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు మండిపడ్డారు.
ఏం జరిగింది: యూరియా కోసం మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని స్థానిక పీఏసీఎస్‌లో రైతులు బారులు తీరారు. ఒక్క బస్తా మాత్రమే ఇస్తుండటంతో రైతులు తమ కుటుంబసభ్యులను సైతం క్యూలో నిలబెట్టారు. గంటల తరబడి క్యూలో ఉన్నా బస్తా కూడా కొందరికి అందలేదు. దీంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితిని గత పదేండ్లలో చూడలేదంటూ గుర్తుచేసుకున్నారు.