Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో రంగం తిరోగమనంలో పయనిస్తున్నాయనే విమర్శ ఎదుర్కొంటున్నది. తెలంగాణను బీఆర్ఎస్ సర్కారు అన్నపూర్ణగా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల భూములు లాక్కుంటూ ఆగం చేస్తున్నదని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఏ రంగంలో చూసుకున్నా సీఎం రేవంత్రెడ్డి పనితీరు ఇలాగే ఉందని, ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ కనుమరుగు ఖాయమని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు ఏకంగా అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పెట్టుబడులు రావాలి, సంపద పెరగాలి. కానీ కక్షసాధింపులతో పాలన సాగిస్తే రాష్ట్రం అశాంతికి నిలయంగా మారుతుంది. తెలంగాణలో సరిగ్గా అదే జరుగుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. జలాశయాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపు పేరిట హైడ్రాను ఏర్పాటు చేసింది. పేదల కలల సౌధాలను కనికరం లేకుండా కూల్చివేసింది. హైడ్రా తరహా ఏజెన్సీలను రాష్ట్రమంతా విస్తరిస్తామని చెబుతూ సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలకు విరామమిచ్చిన ప్రభుత్వం ఫార్మా విలేజ్లతో రైతులపై విరుచుకుపడింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతులతో చర్చించకుండా బలవంతపు భూసేకరణకు పూనుకున్నది. అభ్యంతరం తెలిపిన ప్రజలను అడ్డగోలుగా జైల్లో పెట్టింది. ప్రశ్నించిన మహిళలపై పోలీసులు కీచకపర్వం సాగించారు. జైల్లో మగ్గుతున్న రైతుకు గుండె నొప్పి వస్తే బేడీలు వేసి దవాఖానకు తరలించిన ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో కొత్తగా ఒక్క పారిశ్రామికవాడను కూడా అభివృద్ధి చేయలేదు. ఒక్క పెద్ద పరిశ్రమను తీసుకురాలేదు. ప్రోత్సాహకాలు లేక పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూడటం మానేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పరిశ్రమలకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రిబ్బన్ కటింగ్లు చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఎంఎస్ఎంఈ పాలసీని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం విధివిధానాలు రూపొందించలేదు. ఈ ప్రభుత్వంతో పోరుపడలేకనే పరిశ్రమలు పక్కరాష్ర్టాలకు తరలిపోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
రాష్ర్టానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయాన్ని సమకూర్చుతూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సినీ రంగాన్ని కూడా ప్రభుత్వం వదలడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా వాళ్లతో మంత్రులు గిచ్చికయ్యం పెట్టుకోవడం, అనవసర గొడవలు సృష్టించుకోవడం, అహం దెబ్బతిని అరెస్టు వరకు వెళ్లడం ఏంటని సినీవర్గాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సినీపరిశ్రమ కార్యకలాపాలకు సీఎం వైఖరి ఆటంకంగా మారిందని కొందరు చెబుతున్నారు.
రేవంత్రెడ్డి ఏడాది పాలనపై ప్రజలతో పాటు మంత్రులు, సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు తెలుస్తున్నది. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న సర్కారు ఎంతకాలం మనుగడ సాగిస్తుందో చెప్పలేమంటూ సీనియర్లు కుమిలిపోతున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో చర్చించకుండానే సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వ్యతిరేకతను మాత్రం తామంతా అనుభవించాల్సి వస్తున్నదని ఓ లీడర్ వాపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని పాత కాంగ్రెస్ నేతలు చర్చించకుంటున్నట్టు తెలిసింది.