ఆదిలాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : పంట అమ్మిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐలో బైఠాయించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడకు చెందిన నక్కల జగదీశ్, అంకోలికి చెందిన నల్లా వికాస్, భీంపూర్ మండలం వడూర్‌కు చెందిన జిల్లెల్ల మోహన్ నిరుడు సీసీఐకి పత్తి విక్రయించారు. జగదీశ్‌కు రూ.2 లక్షలు, వికాస్‌కు రూ.76 వేలు, మోహన్‌కు రూ. లక్ష రావాలి. ఆదిలాబాద్ ప్రధాన పోస్టాఫీసులోని వీరి ఖాతాల్లో పైసలు జమ అయ్యాయి. పోస్టల్ సిబ్బంది డబ్బులను సొంతానికి వాడుకోవడంతో రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బంది రైతుల డబ్బులను బ్యాంకుల్లోని వారి ఖాతాల్లో జమ చేశారు.
ఏడాదిగా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు పోస్టాఫీసు నుంచి తమ బ్యాంకు ఖాతాల్లో జమైన డబ్బుల కోసం తిరుగుతున్నట్టు బాధిత రైతులు తెలిపారు. డబ్బులు ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులను కోరినా ఫలితం లేదని వాపోయారు. సైబర్ పోలీసుల సూచన మేరకు ‘మీ డబ్బులు బ్యాంకులో ఫ్రీజ్ అయ్యాయని’ బ్యాంకు అధికారులు సూచించినట్టు రైతులు తెలిపారు. డబ్బులు విడుదల చేసినట్టు సంబంధిత పత్రాలు చూపించినా బ్యాంకు అధికారులు స్పందించడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారుల వైఖరిని నిరసిస్తూ బ్యాంకులోనే బైఠాయించారు. సైబర్ కేసు కారణంగా రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెట్టారని, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు.