పోతంగల్, అక్టోబర్ 27: కొనుగోలు చేసిన సోయా పంటను తిరిగి వాపస్ ఇవ్వడంపై రైతులు భగ్గుమన్నారు. అదీగాక కొనేటప్పుడు 51 కిలోలు కాంటా పెట్టి.. తిరిగి ఇచ్చేటప్పుడు 45 కిలోల బస్తా ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలి కొనుగోలు కేంద్రంలో రైతులు సోయాను విక్రయించారు. సగం ధాన్యం వాపసు వచ్చిందని, పదిమందికి చెందిన 102 సోయా బ్యాగులను తీసుకెళ్లాలని సొసైటీ అధికారులు చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యం బాగోలేదని అంటున్నారని రైతు భగ్గుమన్నారు. తేమ శాతం చూసిన తరువాతే కొనుగోలు చేసిన ధాన్యం ఇప్పుడు బాగోలేదని వాపసు పంపడమేంటని మండిపడుతూ రోడ్డుపై బైఠాయించారు. వాపసు పంపిన ధాన్యాన్ని అధికారులే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.