హైదరాబాద్ : ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించడాన్ని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి.. అత్యధిక ఉప ఉత్పత్తులు వచ్చే ఏకైక పంట కూడా ఆయిల్ పామ్ అని తెలిపారు. బీటెక్ చదివిన యువత కూడా తమ ఉద్యోగాలను వదిలేసి, వ్యవసాయం వైపు వస్తున్నారు. ఎకరా పొలంలో పది లక్షల దిగుబడి సాధిస్తాం అనే ధీమా, ఆత్మవిశ్వాసం యువతలో వ్యవసాయ అధికారులు కల్పించాలన్నారు. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా.. తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.
అబిడ్స్ రెడ్డి హాస్టల్లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, వ్యవసాయ డైరీ, క్యాలెండర్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా, పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారానికి కొరత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం కొరత రాకుండా చూసుకోవాలన్నారు. భూసారాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని సూచించారు.
రూ.3.50 లక్షల కోట్లు వ్యవసాయం, సాగునీరు, నాణ్యమైన కరంటు, రైతుబంధు, రైతుభీమా, మౌళిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా పలు మార్లు చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దేశంలోనే తెలంగాణ వ్యవసాయ శాఖ ఎంతో చైతన్యంగా పనిచేస్తున్నదని తెలిపారు.
ఒకనాడు వ్యవసాయ కుటుంబం అంటే చెప్పుకోవడానికి సిగ్గు పడ్డారు.. ఇప్పుడు ఆ పరిస్థితిని సమూలంగా మార్చేశామని పేర్కొన్నారు. ఈ భూమిలోనే బతుకుదెరువు ఉన్నదని చైతన్యం చేయాలన్నారు. ఇంకా వెయ్యేళ్లయినా అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయ రంగం అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు 92.5 శాతం ఉన్నారు. వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. నూతన క్లస్టర్ల ఏర్పాటుకు కసరత్తు నడుస్తున్నది.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.