ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 10 : ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్‌యార్డు పోటెత్తింది. ఖమ్మం జిల్లా నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి సైతం రైతులు ఊహించని విధంగా పంటను తెచ్చారు. గత వారం ఒకేరోజు సుమారు 75 వేల బస్తాలు రాగా సోమవారం ఏకంగా లక్ష బస్తాలు వచ్చాయి. జెండాపాటలో ఖరీదుదారులు క్వింటాల్ మిర్చి ధరను రూ.14 వేలుగా నిర్ణయించారు. అంతకుముందు రూ.13,600గా నిర్ణయించడంతో రైతులు, కొంతమంది అడ్తీదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు రూ.14 వేలుగా ప్రకటించారు. వందలాది మంది రైతులు పంటను తీసుకొచ్చినప్పటికీ కేవలం ఒక్కరిద్దరికి మాత్రమే జెండాపాట ధర పలకడం గమనార్హం. మిగిలిన రైతుల పంటకు అత్యధిక ధర క్వింటాల్ రూ.12,500 నుంచి రూ.13,500 పలికింది. క్రయవిక్రయాలకు యార్డు సరిపోకపోవడంతో వాహనాలు బయటనే నిలిచిపోయాయి. తాలురకం ధర మరింత క్షీణించింది. అడిగేవారు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిన తాలు రకానికి ధర నిర్ణయించి కొనుగోలు చేశారు.
గుండెపోటుతో మిర్చి రైతు మృతి ;దిగుబడులు రాక మనస్తాపం
గార్ల, ఫిబ్రవరి 10: దిగుబడులు ఆశించిన మేర లేకపోవడం, అప్పులు కుప్పగా మారడంతో దిగులుతో ఉన్న మిర్చి రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ మంగళ తండాలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళతండాకు చెందిన బానోత్ ధర్మా (42) పదేండ్లుగా మిర్చి సాగు చేస్తున్నాడు. గతంలో ధర్మా రూ. 20 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది మొత్తం తొమ్మిది ఎకరాల్లో నాలుగు ఎకరాలు మిర్చి పంట సాగు చేసి పెట్టుబడి కోసం రూ. తొమ్మిది లక్షలు అప్పు తీసుకొచ్చాడు. సోమవారం ఉదయం 93 బస్తాలు మిర్చి ఖమ్మం మార్కెట్ తీసుకొని వెళ్లి అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ద్విచక్ర వాహనంపై నుంచి పడటంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఇంటికి వచ్చిన ధర్మా భార్య క్రాంతితో మాట్లాడుతూ అప్పులు ఎలా తీర్చాలో అని బాధపడుతూ ఒక్కసారిగా గుండెనొప్పితో కిందపడిపోయాడు. సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధర్మా మృతితో మంగళి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.