హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా ఉన్నతాధికారులపై శుక్రవారం వీరారెడ్డిపల్లి గ్రామ రైతులు తిరగబడ్డారు. గంధమల్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ వైఖరిపై యాదాద్రి-భువనగిరి జిల్లా వీరారెడ్డిపల్లికి చెందిన 200 మంది భూనిర్వాసితులు మండిపడ్డారు. అనధికారికంగా ఏర్పాటుచేసిన సమావేశాన్ని వ్యతిరేకించారు. తమ ప్రాంతంలో ఎకరం రూ.కోటి ధర పలుకుతున్నదని, ప్రభుత్వం ఏడాది క్రితం ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ కింద ప్రకటించిన రూ.47 లక్షలైనా ఇవ్వకపోగా.. కేవలం రూ.24.50 లక్షలే ఇస్తానని బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్కువ ధరకు భూములను రాయించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వీరారెడ్డిపల్లికి చెందిన 200 మంది భూ నిర్వాసిత రైతులతో విప్ బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు సహా కలెక్టర్ హనుమంతరావు, డిప్యూటీ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో ఉషారెడ్డి, మదర్ డెయిరీకి చెందిన మధుసూదన్‌రెడ్డి సమక్షంలో రైతులతో చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో ముందుగానే రైతులెవరూ ఫొటోలు, వీడియోలు తీయొద్దంటూ ఆంక్షలు పెట్టారు. దీంతో ఎలాంటి పేపర్ నోటిఫికేషన్, గెజిట్ విడుదల కాకుండా, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటిసులు ఇవ్వకుండా సమావేశం నిర్వహించడంపై గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. అదే గ్రామం నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్లో, గంధమల్ల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోనూ ఒకే సర్వే నంబర్లు ఉన్నాయని రైతులు బీర్ల ఐలయ్యకు వివరించే ప్రయత్నంచేశారు. ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ రైతులకు ఎకరానికి రూ.47 లక్షల పరిహారం నిరుడే ఖరారైందని, ఇప్పుడు గంధమల్ల ప్రాజెక్టు ముంపు చూపి వీరారెడ్డిపల్లిలో కేవలం రూ.24.50 లక్షలు ఇవ్వడమేమిటని రైతులు నిలదీశారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం లేనప్పుడు మరి గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు? టెయిల్ ఎండ్ ప్రాజెక్టు కింద ఈ గంధమళ్లకు నీళ్లు ఎలా వస్తాయి? అని రైతులు విప్ ఐలయ్యను, అధికారులను నిలదీశారు. ‘గెజిట్ ఇవ్వకుండా, నోటిఫికేషన్ రాకుండా, గ్రామసభ పెట్టకుండా రైతులను బెదిరించి సంతకాలు పెట్టించుకునే అధికారం మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. సర్వే కూడా సరిగా జరగలేదని తేల్చి చెప్పారు. దీనికి తాము ఒప్పుకోమంటూ 200 మంది రైతులు మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించి, రీ సర్వే చేయాలని వారంతా డిమాండ్ చేశారు.